రాగులు ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు!

కలం, వెబ్‌డెస్క్: రాగులు శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. రాగులలో కాల్షియం, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రాగులలో ఉండే కాల్షియం ఎముకలను, దంతాలను ధృడంగా మారుస్తుంది. అందుకే చాలామంది తమ రోజువారీ ఆహారంలో రాగుల (Ragi Consumption) ను భాగం చేసుకుంటారు. రాగిజావ, రాగి సంగటి (సంకటి), రాగి మాల్ట్, రాగి దోశ, రాగి ఇడ్లీ ఇలా అనేక రకాల ఆహార పదార్ధాలను రాగులతో చేసుకుంటారు. రాగులు ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అవేంటో మనం తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం

రాగుల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల అవి జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుందట. అందుకే సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు ఎక్కువగా రాగులు తీసుకోవద్దని సూచిస్తున్నారు నిపుణులు. దీనివల్ల అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు.

థైరాయిడ్ ఉన్నవారికి ప్రభావం

రాగుల్లో గోయిట్రోజెన్లు అనే పదార్థాలు ఉంటాయి. గోయిట్రోజెన్లు అంటే తినే ఆహారంలో సహజంగా ఉండే రసాయన సమ్మేళనాలు. ఇవి హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవారిలో థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందువల్ల థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే రాగులను తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు జాగ్రత్త

రాగుల్లో ఆక్సలేట్లు అధికంగా ఉంటాయి. దీనివల్ల కిడ్నీలలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నవారు లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు రాగులను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది అని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

రాగుల వల్ల అలెర్జీ లక్షణాలు

కొంతమందికి రాగులు పడకపోవచ్చు. అలాంటి వారిలో దురదలు, చర్మంపై దద్దుర్లు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాంటి సమస్యలు ఉంటే వెంటనే రాగుల వినియోగాన్ని ఆపి వైద్యులను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.

కానీ, రాగులను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదట. మితంగా తీసుకుంటే రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ముఖ్యంగా రాగి జావ లేదా రాగి సంగటిని పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. మీకు ఇప్పటికే ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఉంటే, రాగులను ఆహారంలో చేర్చే ముందు వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>