అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలి: ఎంపీ గోడం నగేష్

కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేసి, వాటి ప్రయోజనాలను అర్హులైన ప్రజలకు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ (MP Godam Nagesh) సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ గోడం నగేష్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతి, వివిధ శాఖల పనితీరు, పెండింగ్ సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా సమీక్షించారు.

ప్రత్యేకంగా రైల్వే శాఖ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు, జాతీయ రహదారుల నిర్మాణం, రహదారుల విస్తరణ, విద్యా శాఖ, సమగ్ర శిక్షా అభియాన్, మహిళా శిశు సంక్షేమం, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, ఉపాధి హామీ పథకం, పీఎం జన్‌మన్, జన్‌ధన్ యోజన, గిరిజన సంక్షేమం, పోషకాహార పంపిణీ తదితర అంశాలపై శాఖల వారీగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరేలా చూడాలన్నారు.

ప్రజలకు నేరుగా ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పన, రహదారులు, విద్య, వైద్యం, తాగునీరు, మహిళా శిశు సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలవుతున్న నిధులను సక్రమంగా వినియోగిస్తూ, చేపట్టిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ఒక శాఖకు సంబంధించిన పని మరో శాఖతో ముడిపడి ఉన్నప్పుడు పరస్పర సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి శాఖ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల ప్రారంభం, పురోగతి తదితర వివరాలను తనకు ముందస్తుగా తెలియజేయాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక పర్యటనలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రొటోకాల్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలను ఉపేక్షించేది లేదని, నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, ఉట్నూర్ ఐటీడీఏ పీఓ మంద మకరంద్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్‌డీఏ పీడీ రాథోడ్ రవీందర్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సుభాష్, డీఈఓ మాధవి, డీపీఓ రమేష్, ఐసీడీఎస్ పీడీ మిల్కా, దిశ కమిటీ నామినేటెడ్ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>