కలం, నల్లగొండ బ్యూరో : యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri District) భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం (Dothigudem)లోని హేజోలో ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో విధులు నిర్వహిస్తున్న మరో 12 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద ధాటికి భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకుంది.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. అయితే, ప్రమాదం జరిగిన సమయం నుండి కంపెనీ నుంచి విపరీతంగా విష రసాయనాలు లీక్ అవుతుండటంతో దట్టమైన పొగతో పాటు తీవ్రమైన ఘాటైన వాసన వెలుబడుతోంది. ఈ విషపూరిత రసాయన వాయువుల వల్ల సమీప గ్రామాలైన దోతిగూడెం, అంతమ్మగూడెం ప్రజలు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
మూడు నెలల వ్యవధిలో రెండోసారి..
ఈ కంపెనీలో కేవలం మూడు నెలల వ్యవధిలోనే రెండోసారి రియాక్టర్ పేలడం పట్ల స్థానిక ప్రజలు, కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే పదే పదే ప్రమాదాలు జరుగుతున్నాయని, విష రసాయనాల వ్యాప్తితో తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

