కలం, వెబ్ డెస్క్: తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని టీజీ-ట్రాన్స్‌కో, టీజీ-జెన్‌కో, సింగరేణి, డిస్కంల ప్రైవేటీకరణపై రాహుల్ గాంధీ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ జాతీయ విధానం ఢిల్లీలో ఒక విధంగా, తెలంగాణలో మరో విధంగా ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్మించిన ప్రజా ఆస్తులను సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేటీకరించడం దుర్మార్గమని మండిపడ్డారు.
ఈ ప్రభుత్వ ఆస్తులను రాత్రికి రాత్రి ప్రైవేట్ యాజమాన్యానికి అప్పగించే హక్కు రేవంత్ సర్కార్ కు ఎవరు ఇచ్చారు? అని హరీశ్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాలు ఢిల్లీకి మాత్రమే పరిమితమా? తెలంగాణలో వర్తించవా? అంటూ దుయ్యబట్టారు. టీజీ-ట్రాన్స్‌కోలో 26 శాతం వాటా ఎందుకు తగ్గిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము సూటిగా అడుగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లే ఈ నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని కోరారు. టీజీ-ట్రాన్స్‌కో ఐపీఓ, 26 శాతం ఈక్విటీ డైల్యూషన్‌ను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

