కలం, వెబ్ డెస్క్ : కాళేశ్వరం (Kaleshwaram), దేవాదుల (Devadula) వంటి ఎత్తిపోతల పథకాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ ప్రభుత్వం అశాస్త్రీయంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇలా పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే కుట్ర జరుగుతోందని, ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా అని ఆయన నిలదీశారు.
భారీ నీటి పారుదల మోటార్లను ఇష్టానుసారం స్టార్ట్, స్టాప్ చేయడం ఇంజినీరింగ్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని హరీశ్ రావు (Harish Rao) తెలిపారు. పదే పదే ఇలా చేయడం వల్ల తీవ్రమైన వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్స్, మోటార్లు శాశ్వతంగా పాడైపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా లేక కావాలనే చేస్తున్న కుట్రనా అని ఆయన ప్రశ్నించారు. ఈ భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవని, వాటిని పదే పదే ఆపితే ప్రజాధనానికి తీవ్ర నష్టం తప్పదని హెచ్చరించారు.
వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులను ఇంత నిర్లక్ష్యంగా వాడటం శోచనీయమని హరీశ్ రావు పేర్కొన్నారు. ముఖ్యంగా చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12 లలో మోటార్ల ఆపరేషన్ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తక్షణమే ఈ అశాస్త్రీయ విధానాన్ని మానుకోవాలని, ఇంజినీరింగ్ నిబంధనల ప్రకారం డిజైన్ కు అనుగుణంగా నిరంతరాయంగా పంపులు నడిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని ఆయన పేర్కొన్నారు.
Read Also: సామాన్యుడిలా మెట్రోలో ప్రయాణించిన మంత్రి జూపల్లి
Follow Us On: Facebook

