కలం, నల్లగొండ బ్యూరో: సెంట్ భూమి లేని నిరుపేదలు వాళ్లు. కానీ రికార్డుల్లో ఎకరాలకు ఎకరాలు ఉన్నట్లు మాయాజాలం చేశారు. నకిలీ పత్రాలు సృష్టించిన కేటుగాళ్లు అమాయకుల పేరిట భారీగా లోన్లు తీసుకున్నారు. ఇప్పుడు తీసుకున్న అప్పులు చెల్లించాలంటూ బ్యాంక్ నుంచి వచ్చిన రికవరీ నోటీసులు చూసి వారంతా షాకవుతున్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి ఎస్‌బీఐ బ్యాంక్ కేంద్రంగా 50 మంది అమాయకుల పేరిట రూ.70 లక్షల బినామీ రుణాల కుంభకోణం (SBI Loan Scam) వెలుగు చూడటం స్థానికంగా కలకలం రేపుతోంది.
అసలేం జరిగిందంటే..
చింతపల్లి (Chintapally) మండల పరిధిలోని అర్జనాపురం, ఇంచుమూర్, వెంకటంపేట, నిల్వలపల్లి గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతుల పేరిట ఎస్బీఐ బ్రాంచ్‌లో బినామీ రుణాలు మంజూరయ్యాయి. బాధితులకు ఎలాంటి భూమి లేకపోయినా.. ఉన్నట్లుగా నకిలీ పట్టా పాస్‌బుక్కులు సృష్టించారు. ఒక్కొక్కరి పేరిట రూ.1.50 లక్షల చొప్పున లోన్లు డ్రా చేశారు. అర్జనాపురం గ్రామంలోనే దాదాపు 20 మంది రైతుల పేరిట ఈ తరహా బినామీ రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. తమ పేరిట లోన్లు ఉన్నాయనే విషయం బ్యాంకు అధికారులు నోటీసులు పంపే వరకు బాధితులకు తెలియకపోవడం గమనార్హం.
గత మేనేజర్ హస్తం ఉందా..?
బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చి చింతపల్లి ఎస్బీఐ బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు. పవన్ కుమార్ అనే బాధితుడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. “నా పేరు మీద భూమే లేదు. కానీ వెంకటంపేట పరిధిలో 3 ఎకరాల భూమి ఉన్నట్లు నకిలీ రికార్డులు సృష్టించి రూ. 1.50 లక్షల క్రాప్ లోన్ తీసుకున్నారు. వేరే ఊరిలో, తప్పుడు సర్వే నంబర్లతో పాస్ పుస్తకాలు క్రియేట్ చేశారు. ఈ మోసంతో నాకు ఎలాంటి సంబంధం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బ్యాంకు మేనేజర్ స్పందిస్తూ… ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గతంలో ఇక్కడ పనిచేసిన మేనేజర్ హయాంలోనే ఈ మోసం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
స్కామ్ వెనుక కొందరు అధికారులు?
సాధారణంగా సొంత ఖాతాలోని డబ్బులు తీసుకోవడానికే వెళితేనే ఐడీ ప్రూఫ్, సంతకం సహా బ్యాంక్ అధికారులు అన్ని రకాలు ధ్రువీకరించుకుంటారు. అలాంటిది అసలు భూమే లేని నిరుపేదల పేరిట లక్షలాది రూపాయల రుణాలు మంజూరైపోతుంటే ఎందుకు పట్టించుకోలేదనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. భూ భారతి పోర్టల్, ఆన్‌లైన్ రికార్డులు ఉన్న ఈ రోజుల్లో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించడం సాధారణ విషయం కాదు. అయితే అమాయకుల ఆధార్, ఓటర్ కార్డులను సేకరించి.. వాటి ఆధారంగా ప్రైవేట్ కంప్యూటర్ సెంటర్లలో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి ఉండవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. విలేజ్ రెవెన్యూ రికార్డులు, భూమి సర్వే నంబర్ల వివరాలు స్థానిక రెవెన్యూ సిబ్బంది సహకారం లేకుండా బయటకు రావడం అసాధ్యం. వేరే ఊర్లలోని భూములు, ఈ బాధితుల పేర్లపైకి రికార్డుల్లో మార్చారంటే దీని వెనుక కొందరు అధికారుల హస్తం ఉందనేది స్పష్టమవుతోంది.
పరిశీలించకుండానే లోన్ మంజూరు ఎలా?
బ్యాంకు నిబంధనల ప్రకారం పంట రుణం ఇవ్వాలంటే ఫీల్డ్ ఆఫీసర్ లేదా బ్యాంక్ అధికారే సదరు రైతు భూమి వద్దకు వెళ్లి పరిశీలించాలి. ఆ సర్వే నంబర్‌లో భూమి ఉందా? పంట సాగవుతోందా? అనేది తనిఖీ చేయాలి. ఈ స్కామ్‌లో (SBI Loan Scam) అలాంటిదేమీ కనిపించకపోవడంతో బ్యాంకు అధికారుల పాత్రపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో పనిచేసిన మేనేజర్ లేదా లోన్ సెక్షన్ ఇన్‌ఛార్జుల ప్రమేయం లేకుండా రూ.లక్షలు విడుదల కావు. నకిలీ పాస్ బుక్కులను ఆన్‌లైన్‌లో క్రాస్ వెరిఫై చేయాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులదే. ఆ పని చేయకపోవడం వలనే ఈ స్థాయిలో లూటీ జరిగినట్లు స్పష్టమవుతోంది. కేటుగాళ్లు బ్యాంకు అధికారులకు భారీగా కమీషన్లు ఎర వేసి, అమాయకుల పేరిట లోన్లు కొట్టేసినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు.
Read Also: దేశాన్ని విభజించొద్దు.. రేవంత్‌కు కేంద్ర మంత్రి కౌంటర్
Follow Us On: X(Twitter)

