కలం, మెదక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంట మార్పిడిపై ద్వంద్వ విధానం అవలంభిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ‘వరి తగ్గించండి.. పంట మార్పిడి చేయండి’ అంటూ నిత్యం సూచించే రేవంత్.. రైతులు పండించిన సన్ ఫ్లవర్, మొక్కజొన్న, శనగలు, జొన్నలు ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో సన్‌ఫ్లవర్, ధాన్యం కొనుగోలు కేంద్రాలను హరీశ్ రావు సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. తరుగు, నిబంధనల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దోచుకుంటున్నదని ఫైర్ అయ్యారు.
రైతులు పండించిన పంట ఎందుకు కొనరు?
రైతులు పండించిన పంటలను కొనమంటే కేంద్ర ప్రభుత్వ కోటా అయిపోయిందని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రం అయితే ఏంటి? రాష్ట్రం అయితే ఏంటి? రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జొన్నలు కొనడం లేదని, సన్ ఫ్లవర్ కొనుగోలు కుడా పూర్తిగా ఆపేశారన్నారు. నిబంధనల పేరుతో పంటల కొనుగోలుకు సీలింగ్ పెట్టి.. రైతులను ఇబ్బందులు పెడుతున్నరని అరోపించారు.
ఆకాలవర్షంతో తీవ్రమైన నష్టం
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను గాలికి వదిలేసి నిర్లక్ష్యం చేస్తోందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ నది మీద, ఫ్యూచర్ సిటీ మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదని పేర్కొన్నారు. పొద్దున లేస్తే క్యాబినెట్ సబ్ కమిటీ మూసీ సుందరీకరణ కోసం మీటింగ్‌లు పెడుతుంది తప్ప.. ఆరుగాలం కష్టపడ్డ రైతుల కొనుగోళ్ల మీద ఒక్క మీటింగ్ కూడా ఎందుకు పెట్టడం లేదని హరీశ్ ప్రశ్నించారు. వడ్లతో పాటు సన్ ఫ్లవర్, జొన్నలు, మక్కలు, శనగలు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర అందించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

