కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు, రేవంత్ రెడ్డి పోవాలి కేసీఆర్ రావాలి అని ముక్త కంఠంతో చెబుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంతో పాటు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 60 వ జన్మదిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను, ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను, ఆశ అంగన్వాడీ వర్కర్లతో పాటు, ఇతర ఉద్యోగులను, రైతులను గోస పెడుతుందని ఆరోపించారు. అలాగే బీఆర్ఎస్ హయంలో ప్రారంభించిన పనులకు, ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తూ గొప్పలకు పోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాను విద్యా, వైద్యం, వ్యవసాయం వంటి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత పాలకులు ప్రాజెక్టులను పండబెడుతున్నారని, అభివృద్ధిని గాలికి వదిలేస్తున్నారని ఆయన (Harish Rao) దుయ్యబట్టారు.
వ్యవసాయ మంత్రి సొంత జిల్లాలోనే ధాన్యం కొనే దిక్కులేదని, రైతు భరోసా, రైతు ఋణ మాఫీ వంటి పథకాలు అందక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంలోని రఘునాథ పల్లిలో అందరికీ రుణమాఫీ కాలేదని, దమ్ముంటే వచ్చి రైతులను అడగాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు, హరీశ్ రావు సవాల్ విసిరారు. అందరూ రుణమాఫీ అయిందని చెబితే వెంటనే రాజీనామా చేస్తానన్నారు. కాలేదని చెప్తే మీరు రాజీనామా చేస్తారా? అని హరీశ్ రావు సూటిగా ప్రశ్నించారు.
జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు భూ కబ్జాలు, కమీషన్లు, పర్సెంటేజీలతో బిజీగా ఉండి, అభివృద్ధినీ గాలికి వదిలారన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటూ డిల్లీకి కప్పం కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లో పొంగులేటి మైనింగ్ స్కాం ను ప్రశ్నిస్తే మమ్మల్ని జైల్లో పెట్టారని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని హరీశ్ రావు ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాజీ ఎమ్మెల్యే లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

