కలం, మెదక్ బ్యూరో: వడ్ల కొనుగోలు ప్రక్రియలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కొత్త విధానాలు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటుందని, రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీయాలని పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేట జిల్లా నారాయణరావు పేటలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని హరీశ్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రైతు బిడ్డ కాదని.. రైతు ద్రోహి అని విమర్శించారు.
రైతు భీమా.. రైతుబంధు, పంట భీమాను ఎగ్గొట్టడం తప్ప రైతుల కోసం చేసిందేమిలేదన్నారు. గతంలో తరుగు తీస్తే తోలు తీస్తా అన్న రేవంత్.. ఇప్పుడు ఎవరి తోలు తీయాలో చెప్పాలన్నారు. రైతు సమస్యలను పరిష్కరించకపోతే రహదారులు దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. వడ్ల కొనుగొలు చేయకపోతే కలెక్టరేట్ల ఎదుట భారీ ఎత్తున వంటవార్పు చేసి, ధర్నాలు చేస్తామన్నారు. జాతీయ రహదారులపై రాకపోకలను నిలిపివేస్తామని హరీశ్ రావు హెచ్చరించారు.

