మే 2న నల్గొండలో మెగా జాబ్ మేళా

కలం, నల్లగొండ : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మే 2న నల్గొండ (Nalgonda) జిల్లా కేంద్రంలోని న్యాక్ కేంద్రంలో మెగా జాబ్ మేళా పై విస్తృత ప్రచారం కల్పించాలని స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మెగా జాబ్ మేళాపై ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులతో కో-ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో సుమారు 80 కంపెనీలలో 4000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, ఇంకా ఇతర ఫ్యాక్టరీల్లో ఖాళీలు ఉంటే వెంటనే సమాచారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మెగా జాబ్ మేళాకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎక్కువ మంది నిరుద్యోగులు హాజరయ్యేలా విస్తృత ప్రచారం చేపట్టాలని చెప్పారు. ఆర్టీసీ అధికారులు బస్టాండ్ నుండి ప్రత్యేక సర్వీస్ బస్సులు నడపాలని చెప్పారు. ఎండ తీవ్రత దృష్ట్యా వైద్యశాఖ అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకుని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. జిల్లాలోని 7 మున్సిపాలిటీల కమిషనర్లు, సిబ్బంది విస్తృత ప్రచారం నిర్వహించి, ఎక్కువ మంది యువత జాబ్ మేళాకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెగా జాబ్ మేళాకు వచ్చే వారికి తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు వంటి కనీస వసతులు కల్పించాలన్నారు. విద్యుత్ అధికారులు కార్యక్రమం జరుగుతున్నంత సేపు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఆదేశించారు.

ఈ మెగా జాబ్ మేళా లో ఇంటర్ నుండి పీజీ వరకు చదివిన నిరుద్యోగ యువత మాన్యుఫాక్చరింగ్, బ్యాంకింగ్, డిజిటల్ మీడియా, ఫైనాన్స్, హెల్త్ కేర్, ఐ టి, బిజినెస్ సర్వీసులు, కస్టమర్ సర్వీసులు, లాజిస్టిక్, హాస్పిటాలిటీ రంగాలలో ఉద్యోగాలు పొందవచ్చన్నారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువత https://satg.telangana.gov.in/praja palana/ వెబ్ సైట్ ద్వారా లేదా క్యూ ఆర్ కోడ్ స్కాన్ ద్వారా ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ఫోన్ నంబర్ 8074487020 ను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి ఏఎస్‌పీ రమేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, జిల్లా క్రీడల అధికారి అక్బర్ అలీ, పరిశ్రమల జనరల్ మేనేజర్ సతీష్, జిల్లా ఉపాధి కల్పనాధికారి పద్మ, నల్గొండ, యాదాద్రి, సూర్యపేట జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>