సిగాచీ డైరెక్టర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అటాచ్ చేయాలి: హరీశ్

కలం, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ప్రమాద బాధిత కుటుంబాలను (Sigachi accident victims) గాలికి వదిలేశారని రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధితులకు ఇచ్చిన హామీని కూడా నిలుపుకోలేక సీఎం రేవంత్ రెడ్డి తన అసమర్థతను మరోసారి చాటుకున్నాడని దుయ్యబట్టారు. నాడు రూ.కోటి సాయం అంటూ సిగాచి బాధితులను నమ్మబలికి అందులో సగం కూడా వారికి చేర్చని రేవంత్ రెడ్డి నయవంచనలో తనను మించినవారు లేరని నిరూపించుకున్నారని అన్నారు. సిగాచీ పరిశ్రమ అగ్నిప్రమాదంలో 54 మంది అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోతే, ఆ బాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయ్యాయని విమర్శించారు.

మాట తప్పడం సీఎంకు అలవాటుగా మారింది..

ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లిన సీఎం రేవంత్, మంత్రులు వివేక్, రాజనర్సింహ.. మృతదేహాల సాక్షిగా ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఇదంతా కంటితుడుపు చర్యే అని, బాధితులకు జరిగిన న్యాయం శూన్యమని ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంతో తేటతెల్లమైందని పేర్కొన్నారు. మాట ఇచ్చి తప్పడం ముఖ్యమంత్రికి అలవాటుగా మారిందనడానికి ఈ ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కై పరిహారం లెక్కల్లో చేస్తున్న మోసం అంతా ఇంతా కాదని చెప్పారు. ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించిన అధికారిక లెక్కల ప్రకారం, 54 మంది బాధితులకు కలిపి ఇప్పటివరకు చెల్లించిన రూ. 24.51 కోట్లను విభజించి చూస్తే, ఒక్కో కార్మికుడి కుటుంబానికి సగటున అందిన పరిహారం కేవలం రూ. 45.40 లక్షలు మాత్రమేనన్నారు. అంటే సీఎం హామీ ఇచ్చిన కోటి రూపాయల పరిహారంలో ఇంకా ఒక్కో కుటుంబానికి దాదాపు రూ. 54.60 లక్షల చొప్పున, మొత్తంగా రూ. 29.48 కోట్ల బకాయిని ఈ ప్రభుత్వం ఎగ్గొట్టి బాధితులను నట్టేట ముంచిందని ఫైర్ అయ్యారు.

డెత్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి తిప్పించుకున్నారు..

ఇక ప్రమాదంలో కాలి బూడిదై ఆచూకీ దొరకని 8 మంది కార్మికుల కుటుంబాలను డెత్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్న దుర్మార్గ ప్రభుత్వం ఇదని దుయ్యబట్టారు. ఇది కేవలం ఒక ప్రమాదం కాదని.. యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగిన సామూహిక హత్య అని పేర్కొన్నారు. ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు గాలికొదిలేశారని విచారణలో ఆధారాలతో సహా స్పష్టంగా తేలిందని చెప్పారు. 818 హెచ్‌పీ సామర్థ్యానికి మాత్రమే అనుమతి తీసుకుని, అక్రమంగా 1777 హెచ్‌పీకి యంత్రాలను పెంచేశారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వందల కోట్ల టర్నోవర్ ఉన్న సిగాచీ కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అటాచ్ చేయాలని డిమాండ్ చేశారు. వాటిని అమ్మి అయినా బాధిత కుటుంబాలకు ఇచ్చిన హామీ మేరకు ఏ కొర్రీలు లేకుండా కోటి రూపాయల పరిహారాన్ని తక్షణమే చెల్లించాలన్నారు. కార్మికుల ఈఎస్ఐ, పీఎఫ్ డబ్బులను పరిహారంగా చూపే నీచమైన కుట్రలను తక్షణమే ఆపాలని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>