కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు జల ద్రోహం చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అటు కృష్ణా నది వాటాలో కేఆర్ఎంబీ తెలంగాణకు ద్రోహం చేసిందని.. ఇటు గోదావరి జలాల్లో సెంట్రల్ వాటర్ కమిషన్ ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? తమ రాజకీయ ప్రయోజనాలే చూసుకుంటారా? అంటూ ఘాటుగా స్పందించారు.
90 టీఎంసీలు తెలంగాణ హక్కే..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించిన 90 టీఎంసీలు తెలంగాణ హక్కేనని హరీశ్ రావు స్పష్టం చేశారు. మన నీళ్లను మనం వాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్వోసీ (NOC) ఎందుకు అవసరం? అని ప్రశ్నించారు.బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించబోయే 1,050 టీఎంసీలలో తెలంగాణకు 700 టీఎంసీలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ పరిస్థితిలో 90 టీఎంసీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఓసీ తీసుకుంటే, ట్రిబ్యునల్ అవార్డులో తెలంగాణ వాటా నుంచి 90 టీఎంసీలు కోత పడుతుందని చెప్పారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలమూరు జిల్లాకు అన్యాయం చేస్తున్నాడని దుయ్యబట్టారు. 16 టీఎంసీల కృష్ణా నీళ్లను ఆపుకోమని ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు రేవంత్ సర్కార్ క్లియరెన్స్ ఇస్తుందని.. దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది మన జూరాల ప్రాజెక్టేనని అన్నారు. అటు కృష్ణాలో, ఇటు గోదావరిలో తెలంగాణకు శాశ్వతమైన అన్యాయం జరుగుతోందన్నారు.
గోదావరిలో తెలంగాణకు 213 టీఎంసీల నష్టం..
పోలవరం- కావేరి అనుసంధానం వల్ల గోదావరిలో తెలంగాణకు 213 టీఎంసీల నష్టం జరగబోతున్నదని హరీశ్ రావు ఆరోపించారు. ఈ తుగ్లక్ ప్రభుత్వం వల్ల ఏమాత్రం అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు చర్యల వలన తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని చెప్పారు. అంతేకాకుండా మరో 167 టీఎంసీలతో గోదావరి – బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం పావులు కదుపుతోందని అన్నారు. మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ కూడా ఇవ్వకుండా సీక్రెట్‌గా మీటింగులు పెట్టుకొని 167 టీఎంసీలతో బనకచర్ల ప్రాజెక్టు కట్టడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గత రెండు మూడు నెలలుగా డ్రామా నడుస్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమావేశాలకు తెలంగాణ తరఫున చంద్రబాబు నాయుడు నమ్మిన బంటు ఆదిత్యనాథ్‌దాస్ ఒక్కడే వెళ్తున్నడని.. తెలంగాణ ఇంజినీర్లను మాత్రం తీసుకెళ్లడం లేదన్నారు. బాబు కళ్లలో ఆనందం కోసం రేవంత్ తెలంగాణను పట్టించుకోవడంలేదని అన్నారు.

