కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లతో పాటు అన్ని మౌలిక వసతుల పనులను నవంబర్ నెలాఖరులోగా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్తో కలిసి ఆయన వెలుగుమట్ల కాలనీలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి, ప్రతి ఇంటి నిర్మాణ పురోగతిని పరిశీలించారు. ఇళ్లతో పాటు బస్తీ దవాఖానా, పాఠశాలలు, రహదారులు, డ్రైనేజీ పనులను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
వెలుగుమట్ల పరిశీలన అనంతరం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో నగర అభివృద్ధి పనులపై మంత్రి తుమ్మల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో చేపడుతున్న పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లపై అధికారులతో చర్చించారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ సమన్వయంతో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. భవన నిర్మాణ అనుమతులను నిబంధనల ప్రకారమే మంజూరు చేయాలని, టౌన్ ప్లానింగ్ అధికారులు డివిజన్ల వారీగా బాధ్యతలు నిర్వర్తించాలని పేర్కొన్నారు.
నగరంలో కొనసాగుతున్న భూగర్భ మురుగునీటి పారుదల (యూజీడీ) పనులను ఫిబ్రవరి 2027 నాటికి వంద శాతం పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. యూఐడీఎఫ్ నిధులతో మంజూరై ఇప్పటివరకు ప్రారంభం కాని 30 పనులను వెంటనే చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) పనులను వేగవంతం చేసి, అక్కడ శుద్ధి చేసిన నీటిని రహదారుల మధ్య డివైడర్లలోని మొక్కలకు వినియోగించాలని తెలిపారు. ఆస్తిపన్ను, నీటి సరఫరా పన్నుల వసూళ్లలో వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని, వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ సమన్వయంతో రక్షించాలని సూచించారు. నగరంలోని ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించి పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఆర్ అండ్ బీ అతిథి గృహం, బడ్జెట్ హోటల్, ఇంటిగ్రేటెడ్ డివిజన్ కార్యాలయాల కోసం స్థలాలను సకాలంలో గుర్తించాలని ఆదేశించారు. ఖమ్మం ఖిల్లా రోప్వేకు మెరుగైన అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయడంతో పాటు, నిర్మాణంలో ఉన్న మూడు బీసీ హాస్టళ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

