కరీంనగర్‌లో సెంట్రలైజ్డ్ కిచెన్.. భాగస్వామిగా హరే కృష్ణ ఫౌండేషన్

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్’లో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ (Karimnagar Centralized Kitchen) త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు ఈనెల 16న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ప్రజాప్రతినిధులకు ఆదివారం ‘హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్’ ప్రతినిధులు ఆహ్వానం పలికారు.

ఈ ప్రాజెక్టుకు ‘హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా’ (Hare Krishna Foundation) అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
​ప్రభుత్వం తొలుత కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. అక్కడ లభించిన విశేష స్పందనతో మధిర, మంథని, మంచిర్యాల ప్రాంతాల్లో కూడా వీటిని విజయవంతంగా అందుబాటులోకి తెచ్చారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు కరీంనగర్‌లోనూ భారీ కిచెన్‌ను సిద్ధం చేశారు.

​17 మండలాల పరిధిలో సేవలు

ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల పరిధిలోని 17 మండలాల్లో గల 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న 49,025 మంది విద్యార్థులకు రోజూ రుచికరమైన, శుభ్రమైన, పోషకాలతో కూడిన అల్పాహారాన్ని అందించనున్నారు.

ఎన్‌ఐఎన్ (NIN) ప్రమాణాలతో పౌష్టికాహార మెనూ

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సహకారంతో విద్యార్థులకు సమతుల్య ఆహారం అందేలా ప్రత్యేక మెనూ రూపొందించారు. ​సోమవారం ఇడ్లీ – సాంబార్, ​మంగళవారం పూరీ – ఆలు కుర్మా, బుధవారం దోశ – చట్నీ, ​గురువారం ఉప్మా – చట్నీ, ​శుక్రవారం మిల్లెట్ ఇడ్లీ – సాంబార్, ​శనివారం బోండా – చట్నీ.. ​దీంతో పాటు విద్యార్థులకు రోజు విడిచి రోజు పాలను కూడా అందించనున్నారు.

విద్యార్థుల సమగ్ర వికాసం

ఉదయాన్నే ఆకలితో పాఠశాలలకు వచ్చే పిల్లలకు పోషకాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, చదువుపై ఏకాగ్రత, పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఉత్సాహంగా చదువుపై దృష్టి సారించేలా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>