కలం, వనపర్తి: ఆపరేషన్ పోలో కారణంగానే నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని బీజేపీ రాష్ట్ర నేత అయ్యగారి ప్రభాకర్ రెడ్డి (Ayyagari Prabhakar Reddy) అన్నారు. ఆపరేషన్ పోలో డే సందర్భంగా ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కార్యక్రమం నిర్వహించారు. సేవా సంకల్ప అభియాన్ కన్వీనర్ పెద్దిరాజు ఆధ్వర్యంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్, తెలంగాణ విమోచన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పించారు.
13 నెలల తరువాత..
ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 13న సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వంలో ప్రారంభమైన ఆపరేషన్ పోలో చారిత్రాత్మక ఘట్టమన్నారు. 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటే, తెలంగాణ ప్రజలు నిజాం, రజాకార్ల అణచివేత, హింస, దౌర్జన్యాల కారణంగా 13 నెలల తరువాత విముక్తి పొందారని తెలిపారు. అప్పటి హైదరాబాద్ సంస్థానంలో భాగమైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయని వివరించారు. తెలంగాణలో మాత్రం అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమన్నారు.
ఎంఐఎం మెప్పు కోసమే..
ఎంఐఎం పార్టీ మెప్పు కోసమే మైనార్టీ ఓట్ల రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆర్. వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా సేవా సంకల్ప కన్వీనర్ పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌గౌడ్, వారణాసి కల్పన, గొర్ల బాబురావు, జిల్లా కార్యదర్శి సరోజ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుమిత్రమ్మ, బాశెట్టి శ్రీనివాసులు, కొమ్ము సామేలు, బచ్చు రాము, గుంటి శివ, ఆగపోగు కుమార్, దాసరాజు ప్రవీణ్, ఎద్దుల దేవేందర్, యువ మోర్చా అధ్యక్షుడు అరవింద్, మహిళా మోర్చా అధ్యక్షురాలు కవిత, మైనార్టీ మోర్చా మాజీ అధ్యక్షుడు ఎండీ ఖలీల్, కంటెస్టెడ్ పట్టణ కార్యదర్శి చినరాయుడు, కౌన్సిలర్లు గంధం బాల, ఉండెకోటి వెంకటేష్, తిరుపతయ్య యాదవ్, కొండోజు గోపీనాథ్, వసిరామ్ నాయక్ పాల్గొన్నారు.

