కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda) జిల్లా మత్స్యశాఖ అధికారి పిల్లి శ్రీపతిపై గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఈనెల 4న సీఎం రేవంత్ రెడ్డికి ఆమె సుదీర్ఘ లేఖ ద్వారా ఫిర్యాదు చేసినా.. కానీ ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఈనెల 20న హనుమకొండ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మహిళా ఉద్యోగి తనకు ఎదురైన వేధింపులను వివరించి, రక్షణ కల్పించాలని కోరారు.
వసూళ్లకు నిరాకరిస్తే కక్షసాధింపా?
మత్స్యశాఖలో ఫీల్డ్‌మెన్ రుడావత్ భవాని నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. సీడ్ స్టాకింగ్‌లో భాగంగా అధికారి క్షేత్రస్థాయికి వెళ్లకపోయినా తాను ఏడు మండలాల్లో చేప పిల్లల పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు. లీజు వసూళ్లలో పర్సెంటేజీలు ఇవ్వాలని అధికారి ఒత్తిడి చేశారని, నిరాకరించడంతో వివిధ వర్గాల నుంచి డబ్బులు వసూలు చేయాలని వేధించారని ఆరోపించారు. గత జూన్‌లో సీడ్ ఫామ్‌కు బదిలీ చేయడంతోపాటు, మరుగుదొడ్లు, కార్యాలయ గది, భద్రతా సౌకర్యాలు లేని చోట విధులు కేటాయించారని వాపోయారు. అదనపు బాధ్యతలు అప్పగించి, ప్రశ్నించినందుకు దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కులం పేరుతో దూషణలు.. లైంగిక వేధింపులు
తాను గిరిజన మహిళ కావడంతో వివక్ష చూపుతున్నారని ఆమె ఆరోపించారు. ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా మానసికంగా, లైంగికంగా వేధించారని, లంబాడీ సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటంతోపాటు బెదిరించారని పేర్కొన్నారు. తనను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారని, నిరాకరించడంతోనే కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. గతంలో జనగామ జిల్లాలో పనిచేసినప్పుడూ ఇదే అధికారి వేధించారని, ప్రమాదంలో చేయి విరిగిన సమయంలోనూ ఆఫీసుకు రావాలని ఒత్తిడి చేశారని ఆమె పేర్కొన్నారు.
కలెక్టర్ విచారణ.. పోలీసులకు ఫిర్యాదు
గత జూలైలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, మత్స్యశాఖ డైరెక్టర్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆరుగురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సిబ్బంది వివరాలు సేకరించి, బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసి నివేదిక సమర్పించినట్లు సమాచారం. అయినా చర్యలు తీసుకోలేదని భావించిన ఆమె ఈనెల 4న సీఎంకు ఫిర్యాదు చేశారు. తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. బాధితురాలికి రక్షణ కల్పించి, ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

