హనుమకొండలో స్కానింగ్‌ సెంటర్లపై కలెక్టర్‌ కొరడా!

కలం, హనుమకొండ: హనుమకొండలోని (Hanamkonda) స్కానింగ్‌, డయాగ్నస్టిక్‌ సెంటర్లపై జిల్లా యంత్రాంగం కొరడా ఝళిపించింది. జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ శుక్రవారం కాకాజీ కాలనీలోని మెప్సన్‌, న్యూ విజన్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లోని అల్ట్రాసౌండ్‌, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ విభాగాలను పరిశీలించి, అందిస్తున్న సేవలు, స్కానింగ్‌ పరీక్షల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

మెప్సన్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో వివిధ స్కానింగ్‌ పరీక్షలకు సంబంధించిన ధరల పట్టికను పరిశీలించిన కలెక్టర్‌.. ధరల వివరాలు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా నిబంధనల ప్రకారం ప్రదర్శించాలని ఆదేశించారు. వైద్యులు, అందిస్తున్న సేవల వివరాలను కూడా ప్రజలకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు.

న్యూ విజన్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌ తనిఖీకి వెళ్లిన సమయంలో కేంద్రం తాళం వేసి ఉండటంతో అక్కడి సెల్లార్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. రెండు కేంద్రాల్లోనూ బిల్డింగ్‌ ప్లాన్‌ ప్రకారం పార్కింగ్‌కు కేటాయించిన స్థలాలను డయాగ్నస్టిక్‌ కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో సంబంధిత కేంద్రాలకు నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎ. అప్పయ్యను కలెక్టర్‌ ఆదేశించారు.

పార్కింగ్‌ స్థలాలను ఆక్రమిస్తే చర్యలు..

పార్కింగ్‌ కోసం అనుమతించిన ప్రదేశాలను ఇతర అవసరాలకు వినియోగించరాదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. క్లినిక్‌లు, ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టం, పీసీపీఎన్‌డీటీ చట్టంతో పాటు బయోమెడికల్‌ వేస్ట్‌, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అప్పయ్య కాకతీయ కిడ్నీ సెంటర్‌, సిద్ధార్థ కార్డియాక్‌ సెంటర్‌, వినోద డెంటల్‌, మల్లిక చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లను కూడా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ స్థలాలను మెడికల్‌ షాపులు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించిన ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయనున్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. తనిఖీల్లో వైద్య సిబ్బంది సందీప్‌, రంజిత్‌ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>