కలం, వరంగల్ బ్యూరో: నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మంచినీటి సరఫరా (Water Supply) , పారిశుద్ధ్య (Sanitation) నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న (GWMC Commissioner Venkanna) అధికారులను ఆదేశించారు. మంగళవారం మడికొండ, మెట్టుగుట్ట, ఇందిరానగర్, రాంపూర్ ప్రాంతాల్లో ఇంజనీరింగ్, శానిటేషన్ అధికారులతో కలిసి పర్యటించి వివిధ అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మడికొండ బాలాజీనగర్ వాటర్ ట్యాంక్ నుంచి మెట్టుగుట్ట వరకు ఏర్పాటు చేసిన మంచినీటి పైప్‌లైన్‌ను పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా నీటి సరఫరా చేయాలని సూచించారు. కాలనీల్లో నిర్మించిన సీసీ రోడ్ల నాణ్యతను తనిఖీ చేశారు. ఇందిరమ్మ కాలనీ సమీపంలోని స్మశానవాటికను సందర్శించి, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మడికొండ, రాంపూర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన కమిషనర్ ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని స్పష్టం చేశారు.
స్వచ్ఛ ఆటోల ద్వారా ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాలన్నారు. ఈ ప్రక్రియను శానిటరీ జవాన్లు నిరంతరం పర్యవేక్షించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై జరిమానాలు విధించాలని ఆదేశించారు. నగరంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, బిల్‌బోర్డులను తక్షణమే తొలగించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ఈ పర్యటనలో సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇంజనీర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

