కలం, వరంగల్ : వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నాలాలు, చెరువులు, పారిశుధ్య నిర్వహణ పనులను వేగవంతం చేయాలని గ్రేటర్ వరంగల్ (Warangal ) మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ హనుమకొండలోని SBH కాలనీ, వడ్డేపల్లి చెరువు, సమ్మయ్యనగర్, బృందావన్ కాలనీ, పద్మాక్షి ఆలయ పరిసరాలు, అదేవిధంగా వరంగల్‌లోని బొందివాగు, అంబేద్కర్ నగర్, కరీమాబాద్, చిన్న వడ్డేపల్లి చెరువు, ఆటోనగర్ ప్రాంతాల్లో పర్యటించి నాలాలు, పారిశుధ్య నిర్వహణ, ఇంజినీరింగ్ పనులను పరిశీలించారు.
వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, పూడిక, చెత్త తొలగింపు పనులను వేగవంతం చేయాలని అధికారుల్ని కమిషనర్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ తనిఖీల్లో సూపరింటెండింగ్ ఇంజినీర్ రాజ్‌కుమార్, సీఎంహెచ్ఓ డా. రాజా రెడ్డి, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవికుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

