కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు యూనివర్సిటీ (Palamuru University) ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసేలా విద్యార్థులు ప్రతిభ కనబరచాలని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) సూచించారు. మంగళవారం పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ రెండో బ్యాచ్ విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాలమూరు యూనివర్సిటీ స్థాపన వెనుక ఎంతోమంది కృషి, శ్రమ దాగి ఉందని, వారి కృషికి విద్యార్థులు కృతజ్ఞతగా ఉన్నత స్థాయికి ఎదిగి యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభ ఆధారంగా పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే అవకాశం పొందుతున్నారని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, మెరుగైన సౌకర్యాలను యూనివర్సిటీలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల గత ఏడాది ప్రారంభమైనప్పటికీ, విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు. సుమారు రూ.30 కోట్లతో నూతన భవనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అత్యుత్తమ మౌలిక వసతులతో పాటు విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
విద్యార్థులు ఏ లక్ష్యంతో యూనివర్సిటీలో చేరారో ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. మార్కులు మాత్రమే ప్రతిభకు కొలమానం కాదని, ప్రపంచస్థాయిలో విజయాలు సాధించిన బిల్ గేట్స్ వంటి వారిని ఆదర్శంగా తీసుకొని సృజనాత్మక ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం కాకుండా, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నూతన ఆలోచనలు, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలని సూచించారు.
పాలమూరు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి మంచి వేదికగా నిలుస్తుందని ఆయన అన్నారు. విద్యార్థుల విజయానికి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, అధ్యాపకులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి పాలమూరు యూనివర్సిటీకి, మహబూబ్‌నగర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

