కలం, కరీంనగర్ బ్యూరో: టీఆర్ఎస్ (TRS) పార్టీ అధినేత్రి కవిత (Kavitha)ను తెలంగాణకు తొలి మహిళా ముఖ్యమంత్రి చేయడమే తమ లక్ష్యమని, కవిత సీఎం అయితేనే రాష్ట్రంలో మహిళల స్థితిగతులు మారుతాయని పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జ్ మ్యాకల తిరుపతి అన్నారు. నియోజకవర్గంలో నిర్వహించిన తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమంలో తిరుపతి పార్టీ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ జిల్లా బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ (Gunjapadugu Hariprasad) మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ఉద్యమకారులు పోరాటంలో భాగస్వామ్యం అయ్యారన్నారు. కానీ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు ఆశించిన స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేయలేదని, అందుకే కేసీఆర్‌ను ఇంటికి పంపించారని చెప్పారు.
తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలంటూ 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను అమలు చెయ్యకుండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాదిరిగా భూములను అమ్మడం లేదా చౌకగా వారి అనుచరులకు అప్ప చెప్పటమే తప్ప వారికి ప్రజా సంక్షేమం మీద ధ్యాస లేదన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద కేవలం టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత మాత్రమే పోరాటం చేస్తుందని వారు పేర్కొన్నారు. మహిళలు, యువకులు, రైతులు తెలంగాణ ఉద్యమకారులు, బడుగు బలహీన వర్గాలు ఈరోజు కవిత అడుగులో అడుగేసి ముందుకు నడవడం కోసం చూస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక చొప్పదండి నియోజకవర్గం నాయకులు గుండేటి తిరుపతి, పిట్టల సత్యం, ఎండీ బషీర్, జిల్లా బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, ఆదివాసీ జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు మల్లారెడ్డి, చంటి శ్రీనివాస్, సీపెల్లి వెంకటేష్, గాలిపెల్లి రత్నాకరచారి, లింగంపల్లి శ్రీనివాస్, కొత్తపల్లి తిరుపతి ఎండీ రాజీ, పూసాల పవన్, కైఫ్, నునే చరణ్, పల్లె శారద, అంజలి, అపర్ణ, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.

