కలం, సూర్యాపేట : సూర్యాపేట (Suryapet) జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వల్లపుదాసు సైదులు గౌడ్ కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచారు. 2007 కానిస్టేబుల్ బ్యాచ్ కు చెందిన స్నేహితులు రూ.1,50,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. సైదులు ఆకస్మిక మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబానికి అండగా నిలుస్తూ ఈ సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సైదులు స్నేహితులు మాట్లాడుతూ.. తమ సహచరుడి కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అవసరమైన సమయంలో తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ప్రాణాలను కాపాడే రక్షణ కవచమని, నిర్లక్ష్యం కారణంగా విలువైన ప్రాణాలు కోల్పోకూడదని పేర్కొన్నారు.సైదులు మరణం తమను తీవ్రంగా కలచివేసిందని, ఆయన కుటుంబానికి అందరూ అండగా నిలవాలని స్నేహితులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, మధుమోహన్ రవి ,నాగరాజు, కరుణాకర్, సైదులు, బాలకృష్ణ, మాధవ్ కొండల్, తదితరులు పాల్గొన్నారు.

