కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) యాజమాన్య మార్పు వ్యవహారం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. మిట్టల్ కుటుంబం, అదర్ పూనావాలా ఈ జట్టును భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చిన మరుసటి రోజే కొత్త ట్విస్ట్ ఎదురైంది. ఈ డీల్‌పై కల్ సోమని నేతృత్వంలోని కన్సార్టియం న్యాయపోరాటం చేసే ఆలోచనలో ఉంది. నిజానికి రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేయడానికి సోమని గ్రూప్ మొదట చర్చలు జరిపింది. దాదాపు 15,300 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరేలా కనిపించింది. కానీ చివరి నిమిషంలో చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాతే మిట్టల్, పూనావాలా రంగంలోకి దిగారు. అయితే తమతో చర్చల ప్రక్రియలో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం పారదర్శకంగా వ్యవహరించలేదని సోమని గ్రూప్ ఆరోపిస్తోంది.
ఈ విషయంలో సోమని గ్రూప్ ఇప్పటికే అమెరికాలోని తమ లీగల్ టీమ్‌తో మాట్లాడింది. రాయల్స్ యాజమాన్యానికి లీగల్ నోటీసు పంపాలని వారు నిర్ణయించుకున్నారు. డబ్బు చెల్లించడంలో తాము విఫలమయ్యామన్న వార్తలను సోమని వర్గం ఖండిస్తోంది. వాల్‌మార్ట్ వారసుడు రాబ్ వాల్టన్ వంటి దిగ్గజాలు తమ వెనుక ఉన్నారని, డబ్బు సమస్యే కాదని వారు స్పష్టం చేశారు. అయితే ఫ్రాంచైజీ భవిష్యత్తు, ప్రస్తుత యజమాని మనోజ్ బదాలే పాత్ర విషయంలో ఇరు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీకి సంబంధించిన పాత బకాయిలు, కోర్టు కేసుల గురించి తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకుండా కావాలనే కాలయాపన చేశారని సోమని గ్రూప్ వాదిస్తోంది. ఈ వివాదాన్ని బీసీసీఐ దృష్టికి కూడా తీసుకువెళ్లాలని వారు భావిస్తున్నారు. మరోవైపు మిట్టల్-పూనావాలా ఒప్పందం ప్రస్తుతానికి కొనసాగుతోంది. ఈ డీల్ ప్రకారం జట్టు విలువ 15,660 కోట్ల రూపాయలుగా ఉంది. ఇందులో మిట్టల్ కుటుంబానికి 75 శాతం, పూనావాలాకు 18 శాతం వాటా ఉంటుంది. మనోజ్ బదాలే కీలక పాత్రలో కొనసాగుతారని సమాచారం. ఈ ఒప్పందం 2026 మూడో త్రైమాసికంలో పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ వ్యవహారం న్యాయపరమైన చిక్కుల మధ్య ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.

