Mobile Popup Ad
Mobile Popup Ad

అమరవీరుల త్యాగాలు, పోరాటాల ఫలితమే తెలంగాణ: గవర్నర్

కలం, వెబ్ డెస్క్: అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla) వ్యాఖ్యానించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా మంగళవారం లోక్‌భవన్‌లో గవర్నర్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఆయన ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఆధునిక తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేసిన ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా స్మరించుకోవాలని అన్నారు. “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ” అనే సూక్తిని ప్రస్తావిస్తూ, జన్మభూమి స్వర్గం కంటే గొప్పదని వ్యాఖ్యానించారు.

తెలంగాణ అసలైన జీవనాడిగా రాష్ట్ర శతాబ్దాల నాటి సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ వ్యవసాయ వారసత్వం నిలిచాయని గవర్నర్ అన్నారు. కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువుల నుంచి నేటి ఆధునిక సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతాంగం చేసిన కృషి తెలంగాణను సస్యశ్యామలం చేసిందని కొనియాడారు.వ్యవసాయ రంగంతో పాటు ఐటీ, ఫార్మా, స్టార్టప్ తదితర రంగాల్లో తెలంగాణ అంతర్జాతీయ గుర్తింపు సాధించడం గర్వకారణం అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ విలువలు, ‘సర్వే భవంతు సుఖినః’ అనే ఆదర్శ స్ఫూర్తితో గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం, నగరాల ఆధునికీకరణ సమపాళ్లలో సాగుతూ సుసంపన్న తెలంగాణ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. దేశ ప్రగతిలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని అభిలషించారు. గవర్నర్ వెంట ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, సంయుక్త కార్యదర్శి శశికిరణా చారి, లోక్ భవన్ అధికారులు తదితరులు ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>