కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారించి అందరి దృష్టిని ఆకర్షించిన 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు భారత క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. ఈ నెలాఖరున జరగబోయే టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు అతడిని ఎంపిక చేస్తారా లేదా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే వారం రోజుల్లో ప్రారంభం కానున్న భారత్-ఎ శ్రీలంక పర్యటనకు వైభవ్ ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతడి ఎంపికపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైభవ్‌ను ఇప్పుడే విదేశీ పిచ్‌లపైకి పంపించడం అంత మంచి నిర్ణయం కాకపోవచ్చని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జట్టులో ఉన్న సంజు శాంసన్, అభిషేక్ శర్మల తర్వాత వైభవ్ రేసులో ఉంటాడని ఆయన పేర్కొన్నారు. అయితే ఒకవేళ అతడిని భారత జట్టుకు ఎంపిక చేయాలనుకుంటే, మొదట ఐపీఎల్ లాంటి బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపైనే ఆడించాలని సూచించారు.
న్యూజిలాండ్, సౌతాఫ్రికా లాంటి కఠినమైన విదేశీ పిచ్‌లపై అతడిని నేరుగా ఆడించడం సరికాదని మంజ్రేకర్ అన్నారు. బహుశా అతడు ఐపీఎల్ లాంటి ప్రదర్శననే అక్కడ కూడా పునరావృతం చేయవచ్చని, కానీ గిల్, వైభవ్ లలో ఎవరిని ఎంచుకోవాలనేది సెలక్టర్లకు కష్టమైన నిర్ణయమని చెప్పారు. అందువల్ల ఈ ప్రక్రియ సహజంగా సాగనివ్వాలని స్పష్టం చేశారు. వైభవ్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో ఆలోచించడం బోర్డు లేదా ఇతరుల పని కాదని, అతడే స్వయంగా తన స్థానం కోసం పోరాడాలని అన్నారు.
అతడు కేవలం టీ20లకే పరిమితం కావాలనుకుంటే అది అతడి ఇష్టమని, వన్డేల్లో మొదటి 10 ఓవర్లలో రోహిత్ శర్మ కంటే మెరుగ్గా ఆడే సత్తా అతడికి ఉందని కొనియాడారు. అయితే వైభవ్ ఒకవేళ టెస్ట్ క్రికెట్ ఆడాలనుకుంటే మాత్రం బిహార్ రంజీ జట్టులో కష్టపడి ఆడుతున్న మిగతా ఆటగాళ్లను కాదని కేవలం ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా అతడిని ఎంపిక చేయడం అన్యాయం అవుతుందని అభిప్రాయపడ్డారు. రంజీ జట్టులో చోటు కోసం అతడు పోరాడాలని, అక్కడ అతడి విలువను రాష్ట్ర సెలక్టర్లే నిర్ణయించాలని మంజ్రేకర్ స్పష్టం చేశారు.

