కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని సోఫీనగర్లో ఉన్న ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కలకలం చోటుచేసుకుంది. ఈ సమయంలో పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని హాస్టల్ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ప్రహరీ గోడ సమీపానికి చేరుకున్న బాలిక అక్కడి పొదలు, మట్టి కుప్పల వెనుక దాక్కుంది. విద్యార్థిని కనిపించకపోవడంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది పట్టణ పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే స్పందించిన పోలీసులు పాఠశాల సిబ్బందితో కలిసి ప్రాంగణం పరిసరాల్లో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ప్రహరీ గోడ సమీపంలోని పొదలు, మట్టి కుప్పల వెనుక దాక్కున్న విద్యార్థినిని గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం బాలికకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి, హాస్టల్ నిర్వహణ సిబ్బందికి అప్పగించినట్టు పట్టణ సీఐ సమ్మయ్య తెలిపారు. ఇందులో జిల్లా (Nirmal) విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న ఉన్నారు.

