రాహుల్‌పై కేసు.. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ధర్నా

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై(Rahul Gandhi) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను నిరసిస్తూ మహబూబ్‌నగర్‌లో(Mahabubnagar) కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా (Congress Protest) నిర్వహించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా చేపడుతున్న నిరసనల్లో భాగంగా సోమవారం అంబేద్కర్ చౌరస్తాలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉత్తరాఖండ్‌లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు నిర్వహించినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తున్న కుల వివక్షపూరిత “పరిశుద్ధీకరణ కార్యక్రమాన్ని” ఖండిస్తూ, దానిపై ప్రశ్నించిన రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, గౌరవంతో జీవించే హక్కును కల్పించిందన్నారు. రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా కుల వివక్షను ప్రోత్సహించే చర్యలకు పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా, సామాజిక సమానత్వం కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నమని విమర్శించారు. సత్యం, సామాజిక న్యాయం కోసం ప్రశ్నించే గొంతులను కేసులు, బెదిరింపులతో అణచలేరని స్పష్టం చేశారు.

కుల, మత విభేదాలను రెచ్చగొట్టి ప్రజలను విభజించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ సహించదని సంజీవ్ ముదిరాజ్ అన్నారు. రాజ్యాంగం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు, సామాజిక న్యాయం, సమానత్వ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు. రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని, కుల వివక్షకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, బెక్కరి మధుసూదన్ రెడ్డి, పొల్లెపల్లి యాదయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు రాములు యాదవ్, సాయిబాబా, ఎం.ఏ. కలీం, బంగ్లా రవి, ధోమ పరమేష్, పలువురు కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, టీపీసీసీ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>