కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రకు(Ganesh Immersion) పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. గురువారం సాయంత్రం పట్టణంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ (Flag March) నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గణేష్ నిమజ్జన శోభాయాత్రకు సుమారు 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో అదనపు ఎస్పీ, ఏఎస్పీతో పాటు 15 మంది డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు విధుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. శోభాయాత్ర మార్గాన్ని 8 సెక్టార్లుగా విభజించి ప్రత్యేక పోలీసు బృందాలను మోహరించినట్లు చెప్పారు.
ప్రధాన మసీదులు, సున్నిత ప్రాంతాలు, రూఫ్‌టాప్‌లు, ట్రాఫిక్ పాయింట్లు, నిమజ్జన ప్రాంతాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. పట్టణంలోని 106 సీసీ కెమెరాలు, 4 డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందని తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని ఎస్పీ కోరారు.

