కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణపతులకు బుధవారం భక్తులు వైభవంగా వీడ్కోలు పలికారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవాలు నిర్వహించారు. మానకొండూరు చెరువు (Manakondur Lake) వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్‌లతో కలిసి ప్రారంభించారు.
అంతకుముందు కరీంనగర్ పాతబజార్‌లోని 1వ నంబర్ గణనాథుడికి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ, భద్రతా జాగ్రత్తలతో ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
కరీంనగర్ నగర పరిధి నుంచి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు మానకొండూరు చెరువు వైపు తరలివెళ్లాయి. ఈసారి నిమజ్జనానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. విగ్రహాల నిమజ్జనం కోసం 11 భారీ క్రేన్లతో పాటు గజ ఈతగాళ్లు, అత్యవసర వైద్య బృందాలు, పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. నిమజ్జన ప్రాంతాల్లో లైటింగ్, సౌండ్ సిస్టం, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడికి మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ముగింపు పూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. కొత్తపల్లి, చింతకుంట ప్రాంతాల్లో నిమజ్జన కేంద్రాలను సిద్ధం చేసి భక్తులు, ఉత్సవ కమిటీలకు తాగునీరు, విద్యుత్, లైటింగ్, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలు కల్పించారు.
కరీంనగర్ నగరంతో పాటు హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి తదితర ప్రాంతాల్లోనూ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ నగర పరిధిలోని సుమారు 4,000 విగ్రహాలతో పాటు కమీషనరేట్ పరిధిలోని విగ్రహాల నిమజ్జనం కోసం మానకొండూరు, కొత్తపల్లి, చింతకుంట, బొమ్మకల్, దుర్షెడ్, గోపాల్‌పూర్ తదితర ఆరు కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. టవర్ సర్కిల్, ప్రధాన కూడళ్ల వద్ద శోభాయాత్ర వేదికలను విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు 850 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ శాఖల అధికారులు, పోలీసులు, ఉత్సవ కమిటీలు, ప్రజల సమన్వయంతో గణేష్ నిమజ్జనోత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి.

