కలం, వెబ్ డెస్క్: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వస్తున్న విమాన హై జాకింగ్ యత్నించిన ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతాన్యాహు (Benjamin Netanyahu) స్పందించారు. ఆ పైలట్‌ను ఎవరు పంపించారో కనుక్కుంటామని.. ఎట్టి పరిస్థితుల్లో వారిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రజలను చంపాలని చూసినవారు అతి భారీ మూల్యం చెల్లించుకుంటారని స్పష్టం చేశారు.
ఈ ఘటనకు కారణమైన కో–పైలట్ ఒమన్ దేశానికి చెందిన వ్యక్తిగా ఇప్పటికే గుర్తించారు. ఇజ్రాయెల్–ఒమన్ దేశాల మధ్య సంబంధాలు ఏమాత్రం లేవు. విమానంలో 174 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో వంద మందికి పైగా ఇజ్రాయెలీలే ఉన్నారు. ఈ నేపథ్యంలో 9/11 తరహా దాడి చేయాలని పైలట్ కుట్ర చేశాడని ప్రాథమికంగా నిర్ధారించారు. దీన్ని భారత్ పైలట్ స్మిత్ మచ్ఛర్ అడ్డుకుని.. అందరి ప్రాణాలు కాపాడారు.
రంగంలోకి దిగిన మొస్సాద్…
ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో ఇజ్రాయెల్ ఊపిరి పీల్చుకుంది. దీంతో ఈ దాడికి కుట్ర ఎవరు చేశారో తెలుసుకునేందుకు మొస్సాద్ రంగంలోకి దిగినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్ బద్ధ శత్రువు కాగా.. హమాస్, హిజ్బొల్లా ఉగ్ర సంస్థలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హై జాకింగ్ కుట్ర వెనుక వాటి హస్తం ఏమైనా ఉందా.. అనేది తెలుసుకుంటున్నట్లు పేర్కొంది.
దీని వెనుక ఇరాన్ ఉండి ఉండొచ్చని తనకు కొంత తెలిసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు, సౌదీ అరేబియా అధ్యక్షుడి సలహాదారు ఇది కచ్చితంగా ఉగ్ర కుట్ర అని తేల్చారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా ఉంది. గతంలో ఇజ్రాయెల్ దేశంపై దాడి చేసిన, యత్నించిన వారిని మొస్సాద్ ఏజెంట్లు ప్రపంచంలో ఎక్కడున్న వెతికి, వెంటాడి హతమార్చిన ఘటనలు అనేకం ఉన్నాయి.

