మొరాకోలో భుల్లార్ మెరుపులు.. టాప్-20లో నిలిచిన భారత స్టార్

క‌లం, వెబ్ డెస్క్: ఇంటర్నేషనల్ సిరీస్ మొరాకో గోల్ఫ్ టోర్నీలో భారత స్టార్ గగన్‌జీత్ భుల్లార్ (Gaganjeet Bhullar) అదరగొట్టాడు. తన ఆటతో మెరుపులు మెరిపించాడు. తొలి రౌండ్‌లో 3 అండర్ 70 స్కోరు నమోదు చేసిన భుల్లార్, సంయుక్తంగా 18వ స్థానంలో నిలిచాడు. ఈ వారంలో బరిలో ఉన్న 10 మంది భారత ఆటగాళ్లలో ఆయనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. తొలి తొమ్మిది హోల్స్‌లో భుల్లార్ అద్భుతంగా ఆడాడు. మొదటి నాలుగు హోల్స్‌లో పార్ చేసిన ఆయన, తర్వాత ఐదు హోల్స్‌లో నాలుగు బర్డీలు సాధించి 4 అండర్ 32తో ముందంజలో కనిపించాడు.

అయితే రెండో భాగంలో ఆట పూర్తిగా మారిపోయింది. 13వ, 15వ, 17వ హోల్స్‌లో బోగీలు చేయడంతో స్కోరు తగ్గింది. చివరి హోల్‌లో మరో బర్డీ సాధించి 70 స్కోరుతో రౌండ్‌ను ముగించాడు. 11 ఆసియన్ టూర్ టైటిళ్లతో భారత గోల్ఫ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా ఉన్న భుల్లార్, ప్రస్తుతం టోర్నీలో ముందంజలో ఉన్న థాయ్‌లాండ్ ఆటగాడు పావిట్ టాంగ్‌కమోల్‌ప్రసర్ట్ కంటే ఐదు షాట్లు వెనుకబడ్డాడు. పావిట్ తొలి రౌండ్‌లో 8 అండర్ 65 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు.

భారత ఆటగాళ్లలో కరందీప్ కొచ్చర్, శౌర్య భట్టాచార్య, ఎస్‌ఎస్‌పీ చౌరాసియా, అజీతేశ్ సంధు ఒక్కోరు 1 అండర్ 72 స్కోరుతో సంయుక్తంగా 40వ స్థానంలో ఉన్నారు. లివ్ గోల్ఫ్ లీగ్‌లో ఆడుతున్న అనిర్బన్ లాహిరి ఈవెన్ పార్ 73 స్కోరుతో 60వ స్థానంలో నిలిచాడు. మరోవైపు రషీద్ ఖాన్ (75), శుభమ్ జగ్లాన్ (76), ఆర్యన్ రూపా ఆనంద్ (80), ఉదయన్ మానే (83) నిరాశపరిచారు. వీరు వీకెండ్‌కు అర్హత సాధించాలంటే రెండో రౌండ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.

టోర్నీలో అమెరికాకు చెందిన ఆండీ ఓగ్లెట్రీ 68 స్కోరుతో బలమైన ఆరంభం చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ స్కాట్ విన్సెంట్ 3 అండర్ 70 స్కోరుతో రౌండ్ ముగించాడు. లివ్ గోల్ఫ్ స్టార్ బుబ్బా వాట్సన్ 69 స్కోరు చేయగా, సెర్జియో గార్సియా 74 స్కోరుతో కష్టమైన రోజును ఎదుర్కొన్నాడు. మొదటి రౌండ్ ముగిసే సమయానికి భారత ఆటగాళ్లలో గగన్‌జీత్ భుల్లార్ మాత్రమే టాప్-20లో నిలవడం విశేషం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>