కలం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుల నివాసమైన వైట్‌హౌస్ (White House) సౌత్ లాన్ ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు వేదికగా నిలిచింది. విదేశీ ప్రతినిధుల రాక, ఈస్టర్ వేడుకలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఇక్కడ జరగడం మనకు తెలుసు. కానీ, ఈ వారాంతంలో ఇక్కడ ఎవరూ ఊహించని ఒక సరికొత్త దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. వైట్‌హౌస్ మైదానంలో తొలిసారిగా ఒక ప్రొఫెషనల్ కేజ్ ఫైటింగ్ (UFC) మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం అక్కడ ఒక ప్రత్యేకమైన ఆక్టగాన్ (పోటీ జరిగే రింగ్) కూడా సిద్ధమైంది. అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ అపూర్వమైన క్రీడా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు ఉన్న ఈ ప్రదేశంలో జరగబోయే ఈ ఫైట్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వేలాది మంది ప్రేక్షకులు వస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది టీవీల్లో వీక్షించనున్నారు. రాజకీయాలు, క్రీడలు, పాప్ సంస్కృతుల కలయికగా ఈ ఘట్టం నిలిచిపోనుంది. ముప్పై ఏళ్లుగా వైట్‌హౌస్ వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్ట్ జాన్ డెక్కర్ దీనిపై స్పందిస్తూ, తన కెరీర్‌లో వైట్‌హౌస్ లాన్‌పై ఇలాంటి ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మ్యాచ్ జరగడం ఎప్పుడూ చూడలేదని, ఇది ఒక అపూర్వమైన విషయమని చెప్పారు.
ఈ ఈవెంట్ వెనుక ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు యూఎఫ్‌సీ (UFC) క్రీడతో, అలాగే దాని వ్యవస్థాపకుడు డానా వైట్‌తో చాన్నాళ్లుగా మంచి స్నేహబంధం ఉంది. అధ్యక్షుడు ట్రంప్ ఈ క్రీడను ఎంతగానో ఇష్టపడటమే కాకుండా, అందులో పెట్టుబడులు కూడా పెట్టారు. గతంలో యూఎఫ్‌సీ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న ఇబ్బందుల సమయంలో ట్రంప్ తన సొంత ఆస్తుల్లో ఈ పోటీలను నిర్వహించేందుకు స్థలం ఇచ్చి ఆదుకున్నారు.
నిజానికి 1993లో ప్రారంభమైన యూఎఫ్‌సీ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. ఒకప్పుడు ఈ ఆటను గుర్తించడానికి ప్రభుత్వాలు ఒప్పుకోలేదు, టీవీల్లో ప్రసారాలు లేవు, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఒకానొక దశలో ఈ సంస్థ మూతపడే పరిస్థితికి కూడా వచ్చింది. ఆ సమయంలో ఈ ఆట అమెరికాలో పాపులర్ అయిన ఎన్‌ఎఫ్‌ఎల్ (NFL) కంటే పెద్దదవుతుందని డానా వైట్ చెబితే అందరూ నవ్వుకున్నారు. కానీ, 2001లో డానా వైట్, ఫెర్టిట్టా కుటుంబం ఈ సంస్థను కొనుగోలు చేసిన తర్వాత దీని రూపురేఖలు మారిపోయాయి. వివాదాస్పద ఆటగా ముద్రపడ్డ ఈ స్పోర్ట్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానించే ఒక పెద్ద క్రీడా వినోద సంస్థగా ఎదిగింది.
చాలా కాలంగా యూఎఫ్‌సీని కవర్ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ రాండీ హారిస్ మాట్లాడుతూ, ఈ ఆట మొదటి మ్యాచ్ నుండి తాను చూస్తున్నానని, ఒకప్పుడు మనుగడ కోసం పోరాడిన ఈ క్రీడ, ఈరోజు వైట్‌హౌస్ లాన్‌కు చేరుకుంటుందని డానా వైట్ లేదా డొనాల్డ్ ట్రంప్‌తో సహా ఎవరూ ఊహించి ఉండరని అన్నారు. పాత అభిమానుల కల నిజమైనట్లుగా ఉందని, ఈ ఆదివారం జరగబోయే ఈవెంట్ యూఎఫ్‌సీని ప్రపంచవ్యాప్తంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వైట్‌హౌస్ ప్రాంగణం ఒక ప్రభుత్వ కార్యాలయంలా కాకుండా, ఒక పెద్ద స్పోర్ట్స్ స్టేడియంలా మారిపోయింది. చుట్టూ ప్రేక్షకులు కూర్చునే సీట్లు, భారీ లైట్లు, టీవీ ప్రసారాల కోసం పెద్ద పెద్ద పరికరాలు అక్కడ ఏర్పాటయ్యాయి. ఒకప్పుడు ఆదరణ కోసం వెతుక్కున్న ఒక క్రీడ, ఈరోజు అమెరికా వైట్‌హౌస్ అధ్యక్ష భవనం ముందు నిలబడటం ఆ ఆట సాధించిన విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది.

