కలం, దేవరకొండ : బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం నుంచి దేవరకొండ రాజకీయాల వరకు జానారెడ్డి పెత్తనమే కొనసాగుతోందని టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో జానారెడ్డి ఇద్దరు కుమారులను లంబాడా అభ్యర్థుల చేతిలో ఓడిస్తానంటూ దేవరకొండ వేదికగా బహిరంగ సవాల్ విసిరారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర 34వ రోజుకు చేరుకుంది. మంగళవారం చారకొండ నుంచి పాదయాత్రగా దేవరకొండ పట్టణానికి చేరుకున్న నేపథ్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మల్లన్న ప్రసంగించారు.
కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని మల్లన్న (Teenmaar Mallanna) గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు, మూడేళ్లు గడిచినా ఆ హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుకోవడంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి పాత్ర ఉందని, జానారెడ్డి రెడ్డి సామాజికవర్గానికి చెందిన కొందరిని ముందుపెట్టి హైకోర్టులో కేసులు వేయించారని, తద్వారా బీసీలకు రావాల్సిన 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకున్నారని అన్నారు.
బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ఒకవైపు హామీలు ఇస్తూ, మరోవైపు వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేయడం పసిగట్టే ఆ పార్టీని నిలదీసానని అన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు రాజకీయ అధికారం రెడ్డి, వెలమల సామాజికవర్గాల చేతుల్లోనే కేంద్రీకృతమైందని, జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కడం లేదని అభిప్రాయపడ్డారు. అందుకే ఆయా వర్గాలను రాజకీయంగా ఏకం చేసి అధికారంలో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో పార్టీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
కేసీఆర్ పాలనలో వందలాది కేసులు ఎదుర్కొంటూ, అనేక ఇబ్బందులు భరిస్తూ ఒంటరిగా పోరాడానని పేర్కొన్నారు. తాను కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారని గుర్తుచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తాను కూడా కృషి చేశానని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటలను నమ్మి ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసినట్లు వివరించారు.
దేవరకొండ గిరిజనులకు రిజర్వు చేసిన నియోజకవర్గమైనప్పటికీ ఇక్కడ రాజకీయ పెత్తనం మాత్రం రెడ్డి సామాజికవర్గాల నాయకుల చేతుల్లోనే కొనసాగుతోందని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం బాలు నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నారని, గతంలో రవీంద్ర నాయక్ ఎమ్మెల్యేగా పనిచేశారన్నారు. అయితే వీరిద్దరూ పేరుకు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారని, దేవరకొండ నియోజకవర్గంలో అసలు రాజకీయ పెత్తనం జానారెడ్డి, జగదీశ్ రెడ్డి చేతుల్లోనే ఉందని ఆరోపించారు.
గిరిజన నియోజకవర్గంలో గిరిజన నాయకులకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. బాలు నాయక్‌కు మంత్రి పదవి రాకపోవడానికి జానారెడ్డే కారణమని అన్నారు. బాలు నాయక్‌కు ఉన్న రాజకీయ అనుభవం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా లేదని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బాలు నాయక్ మంత్రి అయితే తన మాట వినడనే భయంతో జానారెడ్డి ఆయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారని వెల్లడించారు. బాలు నాయక్ స్వతంత్రంగా ఎదగడం జానారెడ్డికి ఇష్టం లేదని తీన్మార్ మల్లన్న విమర్శించారు.

