టీచర్లకు భద్రత కల్పించాలి.. గద్వాలలో ట్రస్మా ఆధ్వర్యంలో ర్యాలీ!

కలం, జోగులాంబ గద్వాల: ప్రైవేట్‌ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ టీచర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి‌ మోహిన్ బాషా, అధ్యక్షులు బీచుపల్లి‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు త్యాగరాజు, తదితరులు డిమాండ్ చేశారు.

నల్గొండ జిల్లాలో ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ రూపారెడ్డి దారుణ హత్యకు నిరసనగా ట్రస్మా (TRSMA) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం గద్వాల (Gadwal) జిల్లాలోని అన్నీ ప్రైవేటు పాఠశాలలు బంద్ పాటించాయి. ఈ మేరకు జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో జిల్లా‌ కేంద్రంలో జిల్లాలోని అన్ని ప్రైవేటు స్కూళ్ల కరస్పాండెంట్లు, టీచర్లు పాతబస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపా రెడ్డి పై సొంత విద్యార్థులే అతి కిరాతకంగా 27 కత్తిపోట్లతో దాడి చేసి హత్య చేయడం విద్యా వ్యవస్థకే మచ్చ తెచ్చిన సంఘటన అని, అక్షరాలు నేర్పించే గురువులపై ఇలాంటి ఘాతుకాలకు ఒడిగట్టే స్థాయికి సమాజం దిగజారడం పట్ల అందోళన కలిగిస్తోందన్నారు.

గురువులకే రక్షణ లేని వాతావరణం ఉంటే విద్యా వ్యవస్థ కుప్పకూలిపోతుందని, ప్రైవేట్ విద్యాసంస్థలు నడపడం గగనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు పెడదోవ పట్టడానికి కారణమవుతున్న గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల విక్రయాలపై పోలీస్ శాఖ తీవ్రస్థాయిలో నిఘా పెట్టి, మూలాల నుండి వాటిని నిర్మూలించాలని కోరారు. ​

విద్యార్థుల ప్రవర్తన కేవలం పాఠశాలల బాధ్యతే కాదు. పిల్లల వైఖరి, చెడు అలవాట్లు, స్నేహాలపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రిన్సిపల్ రూపా రెడ్డి మృతికి కారణమైన నిందితులను చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షించాలి అని, బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు.

ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది, పాఠశాల యాజమాన్యాల భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం వెంటనే ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని రూపకల్పన చేసి అమలు చేయాలి అని కోరారు. అనంతరం ప్రైవేటు స్కూల్ కరస్పాండెంట్, టీచర్లకు రక్షణ కల్పించాలని, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>