కలం, జోగులాంబ గద్వాల: మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోందని గద్వాల ఎమ్మెల్యే (Gadwal MLA) బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishna Mohan Reddy) స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూరాల ప్రాజెక్టుకు అవసరమైన నీటిని ఎగువ ప్రాంతాల నుంచి విడుదల చేయించే దిశగా కర్ణాటక ముఖ్యమంత్రి, నీటి వనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్‌తో మాట్లాడి, నీటి విడుదల ఒప్పందానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
రైతులు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే
రైతుల పంటలను కాపాడుకోవడమే ప్రాథమిక ధ్యేయంగా ప్రభుత్వం ఉన్నందున, అందుబాటులో ఉన్న నీటి వనరుల ఆధారంగా దశలవారీగా సాగునీరు విడుదల చేసేందుకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి పాలమూరు, గద్వాల ప్రాంత అన్నదాతలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ప్రభుత్వం అన్ని విధాలా రైతాంగానికి తోడుగా ఉంటూ సాగునీరు అందేలా బాధ్యత తీసుకుంటుందని నాయకులు భరోసా ఇచ్చారు.

