కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Elections) భాగంగా అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ విధిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా ముదిరాజ్ కోఆర్డినేషన్ సంఘం నేతలు పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి పట్టభద్రుడు ఓటు వేయాలని సూచించారు.
మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం కీలక మెట్టుకాడి శ్రీనివాసులు ముదిరాజ్ మాట్లాడారు. గతంలో ఎన్నికైన ఎమ్మెల్సీలు హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలపై ఆశించిన స్థాయిలో స్పందించలేదన్నారు. అందుకే పట్టభద్రుల సమస్యలపై నిరంతరం అధ్యయనం చేస్తూ, ప్రజల మధ్య ఉంటూ శాసనమండలిలో బలమైన గొంతుక వినిపించేవారినే ఎన్నుకోవాలన్నారు.
మండలిలో పోరాడేలా..
సంఘం నాయకులు ఆది కృష్ణమోహన్ ముదిరాజ్, రాజయ్య, పిట్టల మురళి, ఎం.జగన్, జంగం రవి, ఎం.రమేష్, హరిప్రసాద్, మెట్టుకాడి ప్రభాకర్ తదితరులు మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు మండలిలో పోరాడే నాయకత్వం రావాలన్నారు. న్యాయవాదులు, వైద్యులు, ఇంజినీర్లు, ఉపాధ్యాయుల సమస్యలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజల సమస్యలను చట్టసభల్లో లేవనెత్తాల్సిన అవసరం ఉందన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 ప్రకారం పట్టభద్రులకు శాసనమండలిలో దక్కిన ఈ ప్రత్యేక ప్రాతినిధ్య హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆది కృష్ణమోహన్, రాజయ్య, మంత్రి శ్రీనివాస్, పిట్టల మురళి, మెట్టు కాడి ప్రభాకర్, హరిప్రసాద్, జంగం రవి, జనార్ధన్, ఏం. రమేష్, జగన్ ముదిరాజ్, సత్యనారాయణ, రాజశేఖర్, భానుమూర్తి, నరేష్, కిషోర్, బాలకిష్టయ్య, కుమార్ పాల్గొన్నారు.

