మేడిగడ్డ బ్యారేజీ చెక్కుచెదరలేదు: ప్రశాంత్ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో: మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోయిందని.. కూలిపోయిందని కాంగ్రెస్, సీఎం రేవంత్  చేస్తోన్న ప్రచారం పూర్తిగా పచ్చి అబద్ధమని బీఆర్ఎస్ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మొదట కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాణహిత–గోదావరి సంగమ ప్రాంతాన్ని, సిరోంచ, కాళేశ్వరం మధ్య గోదావరి బ్రిడ్జ్ వద్ద ఉన్న నీటి ప్రవాహాన్ని, కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రాంతాన్ని పరిశీలించి తదనంతరం నేరుగా మేడిగడ్డ బ్యారేజీని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన అనంతరం.. బ్యారేజీ పైకి వాహనాలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు వారితో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, పార్టీ ప్రతినిధులు వాగ్విదానికి దిగారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ మొత్తం 85 పిల్లర్లతో నిటారుగా చెక్కుచెదరకుండా నిలబడి ఉన్న వాస్తవాన్ని స్వయంగా మీడియా కెమెరాల సాక్షిగా ప్రజలందరూ గమనించవచ్చని పేర్కొన్నారు. గత మూడు వర్షాకాలాల్లో సంభవించిన భారీ వరదలు, లక్షలాది క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకొని నిలబడిన ఈ బ్యారేజీలో ఒక్క పిల్లర్ కూడా కొట్టుకుపోలేదని స్పష్టం చేశారు.

రిజర్వాయర్లన్నింటినీ నింపవచ్చ..

కేవలం రెండు మూడు పిల్లర్లకు చిన్నపాటి మరమ్మతులు అవసరమైతే, వాటిని మూడేళ్లుగా సర్కార్ బాగుచేయడం లేదని.. ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తోందని ప్రశాంత్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత కరువు పరిస్థితుల్లోనూ మేడిగడ్డ వద్ద దాదాపు 22,000 క్యూసెక్కుల ప్రవాహం (రోజుకు సుమారు 2 టీఎంసీల మేర నీరు) వృథాగా దిగువకు తరలిపోతోందని అన్నారు. కన్నెపల్లి పంపులను ఆన్ చేసి ఆ నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ (SRSP), నిజాంసాగర్ సహా మిడ్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ వంటి రిజర్వాయర్లన్నింటినీ నింపవచ్చని వివరించారు.

రోజుకు ఒక టీఎంసీ చొప్పున ఎత్తిపోస్తే..

రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 రోజులు నీటిని ఎత్తిపోస్తే ఎస్సారెస్పీ ప్రాజెక్టును పూర్తిగా నింపవచ్చని ప్రశాంత్ రెడ్డి అన్నారు. రోజుకు అర టీఎంసీ చొప్పున నెలన్నర రోజులు పంపింగ్ చేస్తే 18 టీఎంసీల సామర్థ్యం గల నిజాంసాగర్‌ను పూర్తిగా నింపే అవకాశముందని గుర్తుచేశారు. నీరు లేక గుత్ప, అలీసాగర్, చౌట్‌పల్లి హన్మంత్రెడ్డి, నవాబు, వేంపల్లి, సారంగాపూర్, మెంట్రాజ్ పల్లి లిఫ్టుల కింద, నిజాంసాగర్ ఆయకట్టు కింద లక్షలాది ఎకరాల పంటలు ఎండుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని..

గోదావరి జలాలను ఎత్తిపోసి చెరువులు, రిజర్వాయర్లు నింపితే కేసీఆర్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ద్వేషపూరితమైన దుర్బుద్ధితోనే కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తోందని ఆరోపించారు. తక్షణమే మోటార్లు ఆన్ చేసి వృథాగా పోతున్న నీటిని ప్రాజెక్టులకు ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించి సాగునీరు అందించకపోతే తెలంగాణ రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. తక్షణమే నిర్ణయం తీసుకోకపోతే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ‘రైతు పోరుబాట’ ఉద్యమాన్ని చేపడతామని శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

ఈ పర్యటనలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ విప్ గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, జాజాల సురేందర్, హన్మంత్ షిండే,పుట్టమధు, విఠల్ రావు, షేక్ ముజీబుద్దీన్, తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>