పల్లెటూర్లలో చమురు దగా

కలం, నల్లగొండ బ్యూరో: చేతిలో చిల్లిగవ్వ లేక, పొలం దున్నేందుకు డీజిల్ దొరక్క రైతన్న ఆగమవుతుంటే.. ఇదే అదునుగా అక్రమార్కులు దోపిడీకి తెరలేపారు. ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో కృత్రిమ కొరత సృష్టించి గ్రామాల్లో లీటర్ పెట్రోల్‌ను రూ. 200కు విక్రయిస్తూ సామాన్యుడి రక్తాన్ని తాగుతున్నారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో బంకు యజమానుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.

కాసుల వేటలో యజమానులు!

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకవైపు నిల్వలు లేక బంకులు వెలవెలబోతుంటే.. మరోవైపు ఉన్న స్టాక్‌ను అక్రమంగా తరలిస్తూ కొందరు యజమానులు కాసుల వేటలో పడ్డారు. సామాన్య వాహనదారుడు లీటర్ డీజిల్ కోసం కిలోమీటర్ల మేర క్యూ కడుతుంటే.. తెర వెనుక మాత్రం డబ్బాల కొద్దీ ఇంధనం బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోంది. బంకుల్లో బ్లాక్ దందా వ్యవహారం వెలుగులోకి వచ్చినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఒక మధ్యతరగతి వ్యక్తి సంపాదనలో సింహభాగం పెట్రోల్ ఖర్చులకే సరిపోతోంది.

బంకు యాజమానులే సూత్రధారులు..

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 580 కంటే ఎక్కువ పెట్రోల్ బంకులు ఉన్నాయి. జాతీయ రహదారులు (ఎన్‌హెచ్-65, ఎన్‌హెచ్-163) ఈ జిల్లాల గుండా వెళ్లడం వల్ల బంకుల సంఖ్య ఇక్కడ ఇతర ప్రాంతాల కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రోజువారీ ఇంధన వినియోగం సాధారణ రోజుల్లో పెట్రోల్ 8 నుంచి 10 లక్షల లీటర్లు, డీజిల్ వినియోగం 15 లక్షల నుంచి 18 లక్షల లీటర్ల వినియోగం అవుతుంది. వ్యవసాయ కోతలు, వరినాట్ల సమయంలో డీజిల్ వినియోగం మరింతగా పెరుగుతుంది. ప్రస్తుతం ఇంధన కష్టాల నేపథ్యంలో బంకు నిర్వాహకులు బ్లాక్ మార్కెట్ గాళ్లతో చేతులు కలిపి పగటి పూట పెట్రోల్, డీజిల్ వాహనదారులకు పోయడం లేదు. రాత్రి వేళల్లో బ్లాక్ మార్కెట్ కు తరలించి లీటరుకు అదనంగా రూ.50కి పైనే సొమ్ము చేసుకుంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనైతే పరిస్థితి మరీ దారుణం అని చెప్పాలి. బంకుల్లో పెట్రోల్, డీజీల్ ఉన్నా.. వాహనాల్లో పోయకుండా లూజ్ పెట్రోల్‌ను సమీప కిరాణం, ఇతర చిన్న దుకాణాలకు తరలించి అక్కడ లీటరు పెట్రోల్, డీజిల్ రూ.200పైగా విక్రయిస్తున్నారు. దీంతో వాహనాదారులకు పెట్రోల్, డీజిల్ కష్టాలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.

చమురు మంటల్లో సామాన్యుడి బతుకు

ఒకప్పుడు ఇంట్లో సైకిల్ ఉంటేనే అదో గొప్ప విషయం. కానీ నేడు.. ఇంట్లో ఎంతమంది మనుషులు ఉంటే అన్ని వాహనాలు ఉండటం సర్వసాధారణమైపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న అవసరానికి మనం పెట్రోల్ ఇంజిన్‌పైనే ఆధారపడుతున్నాం. టీ తాగడానికైనా, జుట్టు కత్తిరించుకోవడానికైనా చివరకు కాసేపు గాలి కోసం బయటకు వెళ్లాలన్నా వాహనం ఉండాల్సిందే. అంతగా ఆడిక్ట్ అయిపోయాం. మనిషి జీవనశైలిలో వచ్చిన ఈ మార్పు చమురు కంపెనీలకు వరంగా సామాన్యుడికి శాపంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా.. వినియోగం మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే బండి లేకపోతే పని జరగదనే బలహీనతను కొంతమంది అక్రమార్కులు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. దేశంలో ఎక్కడైనా చిన్నపాటి చమురు సంక్షోభం తలెత్తినా లేదా రవాణా నిలిచిపోయినా.. సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కొరత ఉందన్న చిన్న వార్త రాగానే కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్ గ్యాంగ్‌లు రంగంలోకి దిగుతున్నాయి. వంద రూపాయల పెట్రోల్‌ను రెండు వందలకు, మూడు వందలకు అమ్ముతూ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. మరోవైపు “స్టాక్ పుష్కలంగా ఉంది, ఆందోళన వద్దు” అని అధికారులు టీవీల్లో ప్రకటనలు ఇస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుంటాయి. అధికారుల మాటలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎక్కడా పొంతన ఉండటం లేదు.

రోడ్డెక్కిన వాహనదారులు..

ఏపీ రాష్ట్రానికి సరిహద్దు జిల్లాగా ఉండడంతో నల్లగొండ జిల్లాలో ఇంధనం కష్టాలు తారాస్థాయికి చేరాయి. బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఉన్నా.. వాహనాలకు పోయడం లేదు. దీంతో వాహనదారులు నల్లగొండ పట్టణంలో పెద్దఎత్తున రహదారులపై నిరసనకు దిగారు. ఇదే సమయంలో నల్లగొండ పట్టణంలోని సబ్ స్టేషన్ సమీపంలోని ఓ ఫిల్లింగ్ స్టేషన్‌పై వినియోగదారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సాధారణ వినియోగదారులు వస్తే “స్టాక్ లేదు” అని బోర్డులు పెట్టి వెనక్కి పంపిస్తున్నారు. రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా డబ్బాల్లో నింపి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ​జిల్లా కేంద్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. పల్లెల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ప్రధాన బంకుల్లో డీజిల్ దొరకకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని చిల్లర దుకాణదారులు, మధ్యవర్తులు దీనిని అదునుగా చేసుకుంటున్నారు. లీటర్ పెట్రోల్, డీజిల్ ఏకంగా రూ. 200 వరకు విక్రయిస్తూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. ప్రస్తుతం సాగు పనుల సమయం కావడంతో ట్రాక్టర్లకు డీజిల్ అత్యవసరం. దీనిని ఆసరాగా చేసుకుని రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>