కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత తాటి వెంకటేశ్వర్లు (Tati Venkateswarlu) అనూహ్యంగా బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో తనకు జరిగిన ఘోర పరాభవమే ఈ నిర్ణయానికి కారణమని బహిరంగంగా వెల్లడించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షా సమావేశానికి సంబంధించి ఆహ్వాన పత్రికల్లో తన పేరు ముద్రించలేరని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం వేదికపైకి కూడా పిలవకపోవడంపై వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రశ్నించినందుకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ తన అనుచరులు, కార్యకర్తల ముందే అత్యంత దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. “పార్టీలో ఉంటే ఉండండి.. పోతే పోండి” అంటూ వ్యాపారవేత్తలైన ఆ నాయకులు అహంకారంతో మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్సంటేజీల కోసం పనిచేసే ఇలాంటి వారి వలనే పార్టీ తీవ్రంగా నష్టపోతోందని ధ్వజమెత్తారు.
ఆత్మగౌరవాన్ని చంపుకోలేను..
తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని తాటి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు పట్ల తనకు ఎప్పటికీ గౌరవం ఉంటుందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆత్మగౌరవాన్ని చంపుకుని పార్టీలో కొనసాగలేకనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. 1999లో బూర్గంపాడు, 2014లో అశ్వారావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తాటి వెంకటేశ్వర్లు, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం శ్రమించారు. పార్టీలోనే సరైన గుర్తింపు, గౌరవం దక్కకపోవడంతో గులాబీ దళానికి గుడ్‌బై చెప్పారు. రాబోయే రెండు రోజుల్లో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తానని ప్రకటించారు.

