కలం, నిర్మల్: అక్టోబర్ 10న నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన ర్యాలీని(India Alliance Protest) విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Bojju Patel) పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో అఖిలపక్ష నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ నిరసన ర్యాలీలో ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరి రావు, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్, సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య, నిర్మల్ జిల్లా కార్యదర్శి రాజన్న, టీజేఎస్ జేఏసీ నాయకులు వాజిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

