కలం, మక్తల్ : రాష్ట్రంలో మళ్లీ రాబోయేది కేసీఆర్ పాలనే అని, రాష్ట్రంలో రైతులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు పోవాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఒక్కటే మార్గమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి (Chittem Rammohan Reddy) అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం లోని మాగనూరు మండలం నేరేడగం గ్రామ సర్పంచ్ దాసరి వెంకటమ్మ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు వార్డు సభ్యులు, 50 మంది నాయకులు, కార్యకర్తలు బుధవారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నప్పటికీ ముంపు గ్రామమైన నేరేడగం ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. నేరేడగం ముంపు గ్రామ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజలు బీఆర్ఎస్ కు అండగా నిలబడవలసిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి. నరసింహ గౌడ్, మాజీ మండలాధ్యక్షులు మహిపాల్ రెడ్డి, కె.ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

