కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో కలకలం రేపిన షార్ట్‌ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసు (Amulya Sri Case) మరో అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మహేష్ మృతి చెందడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
అమూల్య శ్రీ ఆత్మహత్య ఘటన తర్వాత కేసు నమోదు చేసిన సైదాబాద్ పోలీసులు, మహేష్‌ను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడు ఇటీవలే కోర్టు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చాడు.
అయితే, బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్దిరోజులకే సింగరేణి కాలనీలోని తన ఇంట్లో మహేష్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఘటనాస్థలిని పరిశీలించిన క్లూస్ టీమ్ కీలక ఆధారాలను సేకరించింది. పోలీసులు మహేష్ ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహేష్ మొబైల్ ఫోన్, కాల్ లాగ్స్‌ను విశ్లేషిస్తున్నారు. బెయిల్ పై వచ్చిన తర్వాత ఎవరైనా బెదిరించారా లేదా కేసు విచారణ తాలూకు భయంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడా అనే కోణాల్లో ఆరా తీస్తున్నారు.

