కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్నమిడిసిలేరు గ్రామంలో ఫారెస్ట్ అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఐటీడీఏ అధికారుల స్పష్టమైన ఆదేశాలను బేఖాతరు చేస్తూ, పోడు భూముల్లో (Cherla Podu Lands) దౌర్జన్యంగా మొక్కలు నాటడం పట్ల ఆదివాసీ రైతులు, ప్రజా సంఘాల నాయకులు భగ్గుమన్నారు. గ్రామానికి చెందిన 40 మంది ఆదివాసీ గిరిజనులు గత 20 సంవత్సరాలుగా 50 ఎకరాల పోడు భూమిని సాగు చేసుకుంటున్నారు.
ఈ భూమికి RoFR పట్టాలు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదేం వీరయ్య సిఫార్సు చేయగా.. స్పందించిన భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ సర్వే చేసి నివేదిక పంపాలని సంవత్సరం క్రితం చర్ల ఫారెస్ట్ రేంజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఈ ఆదేశాలను గాలికొదిలేసిన ఫారెస్ట్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, సాగులో ఉన్న భూముల్లో దౌర్జన్యంగా మొక్కలు నాటి ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ చర్ల మండల కార్యదర్శి సంతపూరి సురేష్ తీవ్రంగా మండిపడ్డారు. ఐటీడీఏ ఆదేశాలు అమలులో ఉండగా పోడు రైతుల భూములను లాక్కోవాలని చూడడం చట్టవిరుద్ధమని ధ్వజమెత్తారు. బుధవారం బాధితులు చర్ల తహశీల్దార్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేయగా, ఆయన సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
అక్రమంగా మొక్కలు నాటిన ఫారెస్ట్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి, అర్హులైన పోడు రైతులందరికీ వెంటనే RoFR పట్టాలు మంజూరు చేయాలని, లేనిపక్షంలో ఆదివాసీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సోడి జానకమ్మ, కల్లూరి సరోజినీ, సప్కా రామలక్ష్మి, సోడి జానకి, కొమరం, కమల, శ్యామల రాములమ్మ, కంగాల సీత, సోడి నరసింహరావు, తుర్రం చంటి, పాయల అర్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

