కలం, వెబ్ డెస్క్: టీడీపీకి చెందిన ఇరు వర్గాల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో వెలుగు చూసింది. పీలేరు రాజీవ్‌నగర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మద్యం మత్తులో ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది.
స్థానికుల సమాచారం మేరకు ఘర్షణలో పాల్గొన్న వారు ఒకే పార్టీకి చెందిన వర్గాలుగా తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో వివాదం హింసాత్మకంగా మారి ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో నలుగురు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పీలేరు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘర్షణకు దారితీసిన అసలు కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా రాజీవ్‌నగర్ ప్రాంతంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహించడం, గంజాయి విక్రయాలు పెరగడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మద్యం విక్రయాలు, మత్తు పదార్థాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

