కలం, తెలంగాణ బ్యూరో : ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అమెరికా వెళ్ళాలి.. ఇలాంటి ఆలోచనలను విడిచిపెట్టాలని స్కిల్స్ నేర్చుకున్న యువతకు జర్మనీ, జపాన్, కొరియా లాంటి దేశాల్లో విస్తృతమైన బ్లూ కాలర్ జాబ్స్ ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సాంకేతిక నైపుణ్యంతో జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి దేశాల్లో అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తున్నదని గుర్తుచేశారు. అలాంటి స్కిల్స్ నేర్చుకుని బ్లూ కాలర్ జాబ్స్ వైపు యూత్ ఆలోచనలు ఉండాలన్నారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తుపానుతో పాతికేళ్ల క్రితం నాటి ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు అమెరికాలో ముప్పు వచ్చిందని, స్కిల్స్ ఉన్న ఉద్యోగాలకు డిమాండ్ పెరిగిందన్నారు.
ఉద్యోగం, ఉపాధి ఇవ్వని చదువులు వేస్ట్ :
ఏం చదువుకున్నా అటు ఉద్యోగమైనా రావాలి.. ఇటు ఉపాధి అయినా కలగాలి… ఈ రెండూ లేనప్పుడు ఆ చదువులకు ప్రయోజనం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో ప్రతీ చదువుకు ఉద్యోగమైనా, ఉపాధి అవకాశాలైనా ఉండేవని, అందుకే చాలా దేశాల్లో మనవారు కన్పిస్తారని గుర్తుచేశారు. ఇప్పటిదాకా చదువుకున్న చదువుకు అమెరికా లాంటి విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ఉపయోగపడిందని, ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటే చాలా ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. మన ప్రభుత్వాన్ని చాలా దేశాలు సంప్రదిస్తూ ఉన్నాయని గుర్తుచేశారు. పాతికేండ్ల క్రితం కంప్యూటర్, ఐటీ కొన్నేండ్ల పాటు ఫ్యూచర్‌గా కనిపించిందని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయన్నారు. సింగపూర్, జర్మనీ తదితర దేశాల పర్యటన సందర్భంగా ఆ దేశాల ప్రతినిధులు సెమీ స్కిల్డ్ అవకాశాలపై ప్రస్తావించారని తెలిపారు. తైవాన్, కొరియా లాంటి దేశాలు అమెరికాకంటే అడ్వాన్సుగా ఉన్నాయన్నారు.
యువతకు ఉపాధి అవకాశాల కోసమే స్కిల్స్ :
ఈ వాస్తవాన్ని గుర్తించినందునే రాష్ట్ర ప్రభుత్వం టాటా సంస్థ టెక్నికల్ సహకారంతో ఐటీఐలను అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్లుగా మారుస్తున్నదని సీఎం వివరించారు. ఇప్పటికి 66 ఐటీఐలు ఏటీసీలుగా మారాయన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో పరిశ్రమల అవసరాలకు తగిన స్కిల్స్ నేర్పించి కచ్చితంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కే విధంగా ప్రయత్నిస్తున్నామన్నారు. గతంలో ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ లాంటి చదువులకు ఉద్యోగ భద్రత ఉండేదని, కానీ ఇప్పుడు పాతికేండ్ల తర్వాత ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. ఉపాధి, ఉద్యోగాలను నమ్ముకుని గతంలో వెళ్ళిన మన పిల్లలకు ఇప్పుడు నిరుద్యోగ ప్రమాదం ముంచుకొచ్చిందన్నారు. కానీ స్కిల్స్ నేర్చుకుంటే మాత్రం 100 శాతం బ్లూ కాలర్ జాబ్స్ గ్యారంటీ అని అన్నారు. ఉద్యోగమైనా దొరుకుతుంది.. లేక ఉపాధి అయినా లభిస్తుందన్నారు. స్కిల్ వర్శిటీ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు.
వైట్ కాలర్ వేతనాలకంటే ఎక్కువే :
స్కిల్స్ నేర్చుకున్న తర్వాత అనేక దేశాల్లో బ్లూ కాలర్ జాబ్స్ అవకాశాలున్నాయని గుర్తుచేసిన సీఎం.. ఇప్పుడు యువత వారి ఫోకస్‌ను సాఫ్ట్వేర్ నుంచి స్కిల్స్ వైపు షిప్ట్ చేయాలన్నారు. సాఫ్ట్వేర్ జాబ్‌తో లక్ష రూపాయలు జీతం వస్తే సాంకేతిక నైపుణ్యం ఉంటే రెండు లక్షల జీతం వస్తుందన్నారు. ఆ దేశాల్లో ఉద్యోగావకాశాల కోసమే తెలంగాణ ప్రభుత్వం జపనీస్, జర్మన్, కొరియన్ లాంగ్వేజీలను యూత్‌కు నేర్పించాలని నిర్ణయం తీసుకున్నదన్నారు. ఇతర దేశాలు ఏ విధంగా డెవలప్ అయ్యాయో స్టడీ చేసిన తర్వాత ఈ భాషలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. చాలా దేశాల పౌరులకు ఇంగ్లీషు రాకపోవచ్చు… అయినా వారి భాషల్లోనే వ్యవహారం నడిపిస్తున్నారు… కానీ అమెరికాకంటే మెరుగ్గా ఉన్నారు.. అని అన్నారు. అమెరికా కన్జూమర్ స్టేట్‌గానే ఉన్నదని, అక్కడి జనం వాడే ఉత్పత్తులన్నీ కొరియా, తైవాన్, చైనా.. లాంటి దేశాల్లోనే అని అన్నారు. ఐ ఫోన్ లాంటిది పెద్ద బ్రాండ్ కావచ్చుగానీ వాటి ఉత్పత్తి మాత్రం తైవాన్, కొరియా, చైనా లాంటి దేశాల్లోనే అని అన్నారు.
జూన్ 1 నుంచి పెరగనున్న మినిమం వేజెస్ అమలు :
కార్మికుల కనీస వేతనాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అనే మూడు జోన్లుగా విభజించి అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ అనే నాలుగు కేటగిరీలుగా కనీస వేతనాలను పెంచింది. జూన్ 1 నుంచే ఇవి అమల్లోకి వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ కనీస వేతనాలను పెంచుతున్నామన్నారు. గత ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో ఒక్కసారి కూడా పెంచలేదన్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగా దాదాపు 1 కోటి 11 లక్షల మంది కార్మికులు నష్టపోయారని అన్నారు. వేతనాలను మే డే రోజునే పెంచాలని అనుకున్నా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ చర్చలు జరిపి నివేదిక ఇవ్వడంలో ఆలస్యమైందన్నారు.
మినిమం స్కేల్ రూ. 16 వేలు :
రాష్ట్రం మొత్తం మూడు జోన్లుగా ఉంటుందని మున్సిపల్ కార్పొరేషన్లను ఫస్ట్ జోన్లో, మున్సిపాలిటీలను సెకండ్ జోన్లో, గ్రామీణ ప్రాంతాలను థర్డ్ జోన్‌గా విభజించినట్లు సీఎం తెలిపారు. అన్ స్కిల్డ్ కేటగిరీలో కనీస వేతనం ఇప్పటివరకూ రూ.12,750గా ఉందని, దాన్ని ఇప్పుడు రూ. 16 వేలకు పెంచినట్లు తెలిపారు. సెమీ స్కిల్డ్ కేటగిరీ కనీస వేతనాన్ని రూ. 13,152 నుంచి రూ. 17 వేలకు, స్కిల్డ్ కేటగిరీలో రూ. 13,772 నుంచి రూ. 18,500కు, హైలీ స్కిల్డ్ కేటగిరీలో రూ.14,607 నుంచి రూ.20 వేలకు పెంచినట్లు తెలిపారు. గత ప్రభుత్వం తన బాధ్యతను వదిలేయగా ఇప్పుడు బాధ్యతతో, కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు.

