Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండ వ్యాప్తంగా ఎరువుల‌ విక్రయాలు బంద్

కలం, నల్లగొండ బ్యూరో: న‌ల్ల‌గొండ (Nalgonda) జిల్లాలోని ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల డీలర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టారు. సమస్యల పరిష్కారం కోరుతూ డీలర్లు చేపట్టిన సంపూర్ణ బంద్‌తో జిల్లావ్యాప్తంగా ఎరువుల దుకాణాలు మూతపడ్డాయి. తయారీ కంపెనీల మొండివైఖరి నశించాలంటూ డీలర్లు నినాదాలతో హోరెత్తించారు. ఎరువుల రవాణాకు సంబంధించి అవుతున్న ఖర్చులపై తయారీదారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన రవాణా భారంతో నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ఎరువులతో పాటు అనవసరమైన ఉత్పత్తులను బలవంతంగా అంటగట్టే విధానాన్ని వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు.

ఈ విధానం వల్ల అనవసరపు నిల్వలు పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీలర్లు పేర్కొన్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని డీలర్ల అసోసియేషన్ అల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వం, కంపెనీలు స్పందించి సమస్యను కొలిక్కి తీసుకురావాలని వారు కోరుతున్నారు. మేము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాం, ఇకనైనా మా న్యాయమైన డిమాండ్లను తీర్చాలని, లేనిపక్షంలో విక్రయాలను పూర్తిగా నిలిపివేస్తామని తెలిపారు. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే డీలర్లు బంద్‌కు దిగడం పట్ల రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎరువుల సరఫరాలో అంతరాయం ఏర్పడితే సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని డీలర్లతో చర్చలు జరపాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>