Mobile Popup Ad
Mobile Popup Ad

దారుణం.. మద్యం మత్తులో కన్నకొడుకును చంపిన తండ్రి..!

​కలం, ఖమ్మం బ్యూరో : మద్యం మహమ్మారి కన్న బంధాలను సైతం బలితీసుకుంటోంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ తండ్రి.. తన కన్నకొడుకని కూడా చూడకుండా దారుణంగా కొట్టి చంపిన ఘటన ఖమ్మం జిల్లా కల్లూరు (Kalluru ) మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది.

​పోలీసుల కథనం ప్రకారం… కల్లూరు మండలంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన కొత్తపల్లి సీతారాములు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న సీతారాములుకు, అతని కుమారుడు కిరణ్ కుమార్ (30)కు మధ్య ఘర్షణ తలెత్తింది. ​మాటమాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన తండ్రి సీతారాములు.. కన్నకొడుకనే జాలి కూడా లేకుండా కిరణ్ కుమార్ పై దాడికి తెగబడ్డాడు. కిరణ్ తలపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు తలకు తీవ్ర గాయమై, రక్తం మడుగులో మునిగిపోయిన కిరణ్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

​కొడుకు కిందపడిపోవడంతో కంగారుపడ్డ నిందితుడు సీతారాములు.. వెంటనే తన ఆటోను తీసుకుని ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. మృతుడు కిరణ్ కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చేతికొచ్చిన కొడుకు కళ్లముందే శవమై పడి ఉండటం, సంపాదించే వ్యక్తి దూరమవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను తీవ్రంగా కలచివేశాయి.

ఘటనా స్థలానికి చేరుకున్న కల్లూరు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుడు కొత్తపల్లి సీతారాములు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>