కలం, జనగామ: జనగామ (Jangaon )జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి గ్రామంలో కోడికూర విషయంలో జరిగిన వివాదం విషాదాంతమైంది. కొడుకు దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. జంగిటి రమేష్ (42) మంగళవారం రాత్రి తన తల్లిదండ్రుల ఇంటి నుంచి నాటుకోడిని తీసుకువచ్చి కూర వండాలని భార్య అనూషకు చెప్పాడు. అప్పటికే చేపల కూర వండినట్లు, ఇప్పుడు తాను వండనని భార్య చెప్పింది. ఆగ్రహానికి గురైన రమేష్ భార్యను దూషించగా, కుమారుడు గణేష్ తల్లిని ఎందుకు తిడుతున్నావని ప్రశ్నించాడు. దీంతో రమేష్ కుమారుడిని కూడా దూషిస్తూ కోపంతో చెంపపై కొట్టాడు. ఆవేశానికి గురైన గణేష్ పక్కనే ఉన్న రోకలి బండ కర్రతో రమేష్ తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన రమేష్‌ను స్థానికులు వెంటనే జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఉదయం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో రమేష్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తరిగొప్పుల ఎస్సై శ్రీదేవి తెలిపారు.

