కలం, ఖమ్మం బ్యూరో : భద్రాచలం – చర్ల (Bhadrachalam – Charla Highway) రహదారి ప్రమాదాలపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి మరోసారి నిండు ప్రాణాన్ని బలిగొంది. భద్రాచలం – చర్ల మార్గంలో లక్ష్మీ నగరం వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో చర్ల మండలంలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన కొట్టెం కమల అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కమల బైక్‌పై ప్రయాణిస్తుండగా గుంతలో స్లిప్ అయి కిందపడింది.
అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఆమె పైనుంచి దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనను కళ్లారా చూసిన వాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలుస్తోంది. కమల మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే, భద్రాచలం – చర్ల రహదారి (Bhadrachalam – Charla Highway) పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: డాక్టర్ శ్రీలీల.. ఎంబీబీఎస్ పట్టా అందుకున్న నటి
Follow Us On: Instagram


