కలం, ఖమ్మం బ్యూరో : 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, కనీసం రోజుకు 7 గంటల విద్యుత్‌ను కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదని ఖమ్మం జిల్లా సత్తుపల్లి (Sathupalli) నియోజకవర్గ రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరంతర కరెంట్ కోతలకు వ్యతిరేకంగా శనివారం వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
కందుకూరు, దిద్దుపాడి, భరణిపాడు, లచ్చన్నగూడెం గ్రామాల నుంచి వందలాది మంది రైతులు తరలివచ్చి నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం కందుకూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల ఆందోళనకు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరై పూర్తి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వరాష్ట్రం వస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న నాటి ఉమ్మడి ఏపీ సీఎం వ్యాఖ్యలను కేసీఆర్ సవాల్‌గా తీసుకుని 24 గంటల ఉచిత విద్యుత్ అందించారన్నారు.
కేసీఆర్ హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్ దక్కితే, నేడు కాంగ్రెస్ పాలనలో కనీసం 7 గంటలు కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వ ముందస్తు ప్రణాళికా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసైనా రైతులకు నాణ్యమైన కరెంటును అందించాలని డిమాండ్ చేశారు. అలాగే చాలామంది వద్ద స్మార్ట్‌ఫోన్లు లేనందున, ఎరువులను గతంలో మాదిరిగా కూపన్ల విధానంలోనే అందజేయాలని సండ్ర డిమాండ్ చేశారు.

